గుంటూరు మహిళ వివస్త్ర ఘటనపై జగన్ ఫైర్- పోలీసుల వైఫల్యం అక్కడే..!
గుంటూరులో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదని, రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమని వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) మండిపడ్డారు. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. బుధవారం ఘటన జరిగితే.. మూడు రోజులపాటు దాన్ని కప్పిపెట్టినా, చివరకు ఆ వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చి, రాష్ట్ర ప్రజలంతా చూసి ప్రభుత్వాన్ని అసహ్యించుకున్న తర్వాత, ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటన్నారు.
ఆ వీడియోలు కప్పిపుచ్చేదానిపై శ్రద్ధచూపే బదులు, బుధవారమే తనపై తొలిసారే దాడి జరిగిన తర్వాత, బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించి ఉండి ఉంటే గనక, ఆ తర్వాత ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదు కదా? అని జగన్ ప్రశ్నించారు. ఆమె ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేదా? ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయం? ఇక పోలీస్‌స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా? లేక అధికార పార్టీ నాయకులు ఏంచెప్తే అది చేయడానికా? బాధితురాలికి అండగా నిలవకపోగా, పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తారా? వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా? అని జగన్ వరుస ప్రశ్నలు సంధించారు.

బాధితురాలి మాటకు, ఆమె ఫిర్యాదుకు విలువ లేదా? నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిన తర్వాత చర్యల పేరుతో నాటకాలు ఆడడం ఏ రకమైన పోలీసింగ్? అని జగన్ అడిగారు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి దాడులను ప్రోత్సహించిందని ఆరోపించారు. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చిందన్నారు. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా, ప్రతిపక్షాలపైనా, బాధితులపైనా వేధింపులకు, అక్రమ కేసులకు ఒక సాధనంగా మార్చి రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా దిగజార్చిందన్నారు.

అధికార పార్టీ నాయకులు ఏం చేసినా ఈ పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం రెడ్‌బుక్ పాలనలో గ్రామాలు, వార్డులు, డివిజన్ల స్థాయి వరకూ పాకిందని, అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారని జగన్ విమర్శించారు. ఎలాంటి దారుణాలు చేసినా, ముఖ్యంగా మహిళలపై దాడి చేసినా, వారిని అవమానించినా, వేధించినా తమకు ఏమీ కాదని, తమను కాపాడ్డానికి చంద్రబాబు ఉన్నారనే ధైర్యం, వారిలో పెరిగిపోయిందన్నారు. ఇది చివరకు రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసిందన్నారు. అధికార పార్టీ నాయకుల దురాగతాల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితిలోకి మహిళలను నెట్టేసిందన్నారు. చంద్రబాబు గారూ... ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్? మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్తుందంటూ జగన్ ట్వీట్ ముగించారు.












Click it and Unblock the Notifications