1981: కరెంటే లేని ఊర్లో సోలార్ విప్లవం. నేడు వారసత్వ సంపదగా 'వైట్ క్లిఫ్స్'!
కరెంటు వైర్లు కూడా చేరుకోలేని దట్టమైన ఎడారి ప్రాంతం, నలువైపులా కటిక చీకటి, గాలిలో ఉక్కపోత, వాతావరణంలో భయంకరమైన వేడి. అటువంటి అత్యంత ప్రతికూలమైన ప్రదేశంలో, సరిగ్గా నాలుగున్నర దశాబ్దాల క్రితం ఒక సరికొత్త రికార్డు నమోదైంది. సాంకేతికత ఇంకా శైశవదశలోనే ఉన్న రోజుల్లోనే, ఏకంగా ఒక ఊరు మొత్తానికి సోలార్ పవర్ అందించి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచారు. ఆస్ట్రేలియాలోని అతి మారుమూల ప్రాంతమైన 'వైట్ క్లిఫ్స్'లో 1981లో ప్రారంభమైన ఆస్ట్రేలియా తొలి సోలార్ ప్లాంట్, సుదీర్ఘ ప్రయాణం తర్వాత నేడు చారిత్రక వారసత్వ సంపదగా అధికారిక గుర్తింపు పొందింది.
న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలో ఎడారి సరిహద్దుల్లో ఉండే 'వైట్ క్లిఫ్స్' ఒక చిన్న గ్రామం. అక్కడ గనుల్లో పనిచేసే కార్మికులు, వారి కుటుంబాలు నివసించేవి. ఆ రోజుల్లో ఆ ఊరికి విద్యుత్ గ్రిడ్ వ్యవస్థ లేదు. ప్రత్యామ్నాయంగా డీజిల్ జనరేటర్లు వాడేవారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి ఇంధనాన్ని మోసుకొచ్చి డీజిల్ వాడటం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. ఎల్లప్పుడూ ఆకాశం నిర్మలంగా ఉండి, ఎండలు మండిపోయే ఆ ప్రాంతంలో సూర్యకాంతిని ఎందుకు విద్యుత్‌గా మార్చకూడదనే ఒక గొప్ప ఆలోచన అక్కడ రూపుదిద్దుకుంది.

14 పారాబొలిక్ డిష్‌లు.. ఒక చిన్న ఆసుపత్రి, బడికి వెలుగులు!
ఈ ఆలోచనకు ప్రతిరూపమే 1981లో పూర్తయిన 'వైట్ క్లిఫ్స్ సోలార్ పవర్ స్టేషన్'. దీని కోసం ప్రత్యేకంగా 14 భారీ పారాబొలిక్ డిష్‌లను ఏర్పాటు చేశారు. సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరిగేలా ట్రాకింగ్ వ్యవస్థను అమర్చారు. ఈ డిష్‌లు సూర్యకాంతిని గ్రహించి, యంత్రాలను తిప్పి విద్యుత్‌ను ఉత్పత్తి చేసేవి. అలా తయారైన విద్యుత్‌తో ఆ ఊరిలోని ఒక ఆసుపత్రి, పాఠశాల, పోస్ట్ ఆఫీస్‌తో పాటు 12 ఇళ్లకు వెలుగులు అందించారు. ఎండ లేని సమయంలో వాడుకోవడానికి పాతకాలపు బ్యాటరీలను, అత్యవసర సమయాల్లో డీజిల్ బ్యాకప్‌ను వాడేవారు.
దుమ్ము, తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకుని దశాబ్దకాలం సేవలు!
అప్పట్లో ఈ ప్రాజెక్టు ఒక పెద్ద సాహసమే. తీవ్రమైన వేడి, ముంచెత్తే దుమ్ము ధూళి, నాణ్యమైన పరికరాలు లేని పరిస్థితుల్లోనూ ఈ ప్లాంట్ దశాబ్దానికి పైగా నిరంతరాయంగా పనిచేసింది. సాంకేతిక నిపుణులు లేకపోయినా, గ్లాస్‌లను శుభ్రం చేస్తూ, మిషన్లను సరిచేస్తూ స్థానికులే దానిని నడిపారు. సోలార్ పవర్ అనేది కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాదని, నిజ జీవితంలో ఒక ఊరి అవసరాలను తీర్చగలదని ఈ ప్రాజెక్టు ప్రపంచానికి నిరూపించింది.
కాలానుగుణంగా మూతపడి.. నేడు హెరిటేజ్ కీర్తి పొంది!
కాలక్రమేణా కొత్త రకం సోలార్ ప్యానెళ్లు రావడం, ఇంధన విధానాలు మారడంతో 1990ల మధ్యలో ఈ డిష్ ప్లాంట్ సేవలు నిలిచిపోయాయి. అయితే ఆస్ట్రేలియా పునరుత్పాదక ఇంధన విప్లవానికి మూలకారణమైన ఈ చారిత్రక ప్రాంగణాన్ని గురించిన చర్చ మళ్లీ మొదలైంది. దీంతో న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం ఈ ప్రయోగాత్మక ప్లాంట్‌ను అధికారికంగా 'స్టేట్ హెరిటేజ్ రిజిస్టర్'లో చేర్చింది. భవిష్యత్ తరాలకు ఈ చారిత్రక ప్రయోగాన్ని వివరించేలా ఆ ప్రదేశాన్ని భద్రపరుస్తున్నారు. ఒకప్పుడు చీకట్లను తరిమేసిన ఆ వెండి డిష్‌లు నేడు ఆస్ట్రేలియా హరిత విప్లవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాయి.














Click it and Unblock the Notifications
