TTD Chairman : టీటీడీ ఛైర్మన్ పదవి మా వాళ్లకివ్వండి..! జగన్ కు హరిరామజోగయ్య లేఖ..
ఏపీలో తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ) బోర్డు ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని వైసీపీ సర్కార్ మార్చబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ కీలక పదవి కోసం ఇప్పటికే వైసీపీలో ఉన్న పలువురు నేతలు పోటీ పడుతున్నా సీఎం జగన్ మాత్రం బీసీ నేత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో కాపుల ప్రయోజనాల కోసం ఈ మధ్య తరచుగా స్పందిస్తున్న సీనియర్ నేత హరిరామజోగయ్య ఇదే అంశంపై సీఎం జగన్ కు ఇవాళ ఓ లేఖ రాశారు.
టీటీడీ ఛైర్మన్ పదవిని కాపుల్లో ఉపకులమైన బలిజలకు ఇవ్వాలని కాపు నేత హరిరామజోగయ్య సీఎం జగన్ కు రాసిన లేఖలో కోరారు. రాయలసీమలోని బలిజలకు ఈ పదవి ఇవ్వాలని ఆయన కోరారు. రాయలసీమలో కాపుల జనాభా 20 లక్షలు ఉందని, కాబట్టి కాపు కులస్తుల అవసరం మీకు ఉందని రుజువు చేసుకోవాలన్నా, కాపుల పట్ల సానుభూతి ఉన్నా టీటీడీ ఛైర్మన్ పదవిని బలిజలకు కేటాయించాలని జోగయ్య సీఎం జగన్ ను కోరారు.

వాస్తవానికి రాష్ట్రంలో కాపులు, బలిజలు, తెలగ, ఒంటరి కులాల జనాభా 22 శాతంగా ఉన్న విషయాన్ని జోగయ్య సీఎం జగన్ కు రాసిన లేఖలో గుర్తుచేశారు. అయినా నీలం సంజీవరెడ్డి నుంచి ఇప్పటివరకూ ముఖ్యమంత్రులంతా కేవలం కాపుల్ని తమ ప్రయోజనాల కోసం వాడుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయంలోనూ ఏ రెడ్డి ముఖ్యమంత్రి కూడా చిత్తశుద్ధితో పనిచేయలేదని, చివరకు మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అవకాశం ఉన్నా కాపులకు రిజర్వేషన్ కల్పించలేదని జగన్ కు జోగయ్య చురకలు అంటించారు.
రాష్ట్రంలో కాపులకు సీఎం పదవి పేరుతో ఇప్పటికే చర్చ జరుగుతోంది. టీడీపీ సైతం కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ కు సీఎం పదవిలో భాగం ఇవ్వడం ద్వారా సదరు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాపులు నిర్ణయాత్మక శక్తిగా మారాలని జోగయ్య వంటి వారు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఛైర్మన్ పదవి నుంచే రేసు మొదలుపెట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు జోగయ్య లేఖ నేపథ్యంలో ప్రభుత్వం వేరే సామాజిక వర్గానికి టీటీడీ పదవి కేటాయించేందుకు ఆలోచించే అవకాశముంది.












Click it and Unblock the Notifications