గుడివాడ అమర్‌నాథ్‌తో ముద్రగడ- ఎంట్రీ లాంఛనమేనా..?!
విశాఖపట్నం: కాపు రిజర్వేషన్ల సాధన సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. రాజకీయాల్లోకి పునః ప్రవేశం దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది. సుదీర్ఘకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన రీ ఎంట్రీ ఇవ్వబోతోన్నారని, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ పునరాగమనాన్ని ప్రకటించే అవకాశం ఉందంటూ ఇదివరకే వార్తలొచ్చాయి.
దీన్ని బలపరిచేలా ముద్రగడ పద్మనాభం.. మరో అడుగు ముందుకు వేసినట్టే. తాజాగా ఆయన పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో భేటీ అయ్యారు. సాగరనగరం విశాఖపట్నంలో వారిద్దరూ సమావేశం అయ్యారు. వైఎస్ఆర్సీపీలో లాంఛనంగా చేరొచ్చనే ప్రచారానికి మరింత ఊపు ఇచ్చినట్టయింది ఈ భేటీ.

చంద్రబాబు ప్రభుత్వంలో కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించినప్పుడు ముద్రగడకు చేదు అనుభవాలు ఎదురైన విషయం తెలిసిందే. పోలీసులు ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ముద్రగడ ఉద్యమించారు. ఛలో అమరావతి పాదయాత్రకు పూనుకున్నారు. అప్పట్లో ఆయనకు అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యాయి.
పాదయాత్రకు బయల్దేరిన ముద్రగడను పోలీసులు అడ్డుకుని వారం రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. తుని వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పటికీ- అది కూడా విఫలమైంది. ఆ తరువాత కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ పలుమార్లు బహిరంగ లేఖలను రాశారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత కావడం వల్ల ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి అటు వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం ఆసక్తిగా ఉంది. త్వరలోనే ఆయన అధికార పార్టీ కండువాను కప్పుకొనే అవకాశాలు లేకపోలేదంటూ గతంలోనూ వార్తలొచ్చాయి గానీ అవి వాస్తవ రూపాన్ని దాల్చలేదు.
ఇప్పుడున్న పరిస్థితులు వైఎస్ఆర్సీలో చేరడానికి అనుకూలంగా ఉన్నట్లు ముద్రగడ్డ వర్గీయులు భావిస్తోన్నారు. దీనికి కారణం లేకపోలేదు. తునిలో రైలు దగ్ధం కేసులన్నింటినీ జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటినీ- అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే వెనక్కితీసుకుంది.
ఇటీవలే రైలు దగ్ధం కేసును కూడా కోర్టు కొట్టేసింది. దీనితో తనపై ఎలాంటి ఒత్తిళ్లూ లేవని, రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ఇదే మంచి సమయం అనే అభిప్రాయంలో ముద్రగడ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో- తాజాగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ముద్రగడ కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ సందర్భంగా పార్టీలో చేరిక అంశం ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. దీనిపై ముద్రగడ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే తన నిర్ణయాన్ని తెలియజేస్తానని హామీ ఇచ్చారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో సాగుతోంది. వైసీపీలో చేరడంపై కాపు రిజర్వేషన్లకు సంబంధించిన కొన్ని కండిషన్లు పెట్టే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications