ముద్రగడ అరెస్ట్‌పై మాట్లాడుతూ.. మృతి: హైద్రాబాద్‌లో రోడ్డెక్కిన కాపులు
హైదరాబాద్/రాజమహేంద్రవరం: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు కొత్తపల్లి మండల కాపు సంఘ నాయకులు సంఘీభావంగా చేపట్టిన ఆందోళనలో అపశృతి చోటుచేసుకుంది. ముద్రగడను ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వం అరెస్టు చేసిందని కాపు సంఘ నేతలు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఒక కాపు నాయకుడు ఆకస్మికంగా మృతి చెందాడు.
తూర్పు గోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామంలో ముద్రగడ అరెస్టును ఖండించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ముద్రగడ అనారోగ్యం, అరెస్టుపై ఉద్వేగభరితంగా మాట్లాడుతూ.. మేడిశెట్టి నూకరాజు అలియాస్ బాబులు (40) మృతి చెందాడు.

దీంతో కొండెవరంలో కాపు సంఘ నేతలు విచారం వ్యక్తం చేశారు. అలాగే గొల్లప్రోలుకు చెందిన కాపు నేతలను అరెస్ట్ చేసి కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో కాపు సామాజిక నేతలు అధిక సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ప్రభుత్వ చర్యలను, అక్రమ అరెస్టులను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు.
హైదరాబాదులో రోడ్డెక్కిన కాపు జేఏసీ

కాగా, ముద్రగడ పద్మనాభం అరెస్టును నిరసిస్తూ హైదరాబాదులో కాపు యువత, కాపు జేఏసీ రోడ్డెక్కింది. ఆదివారం నాడు ట్యాంక్ బండ్ ప్రాంతంలో పలువురు కాపు నాయకులు నిరసన తెలిపారు. ర్యాలీ సందర్భంగా వారు నోటికి నల్లటి గుడ్డను కట్టుకొని నిరసన తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీలలో చేర్చారని, అరెస్టు చేసిన ముద్రగడ పద్మనాభంను వెంటనే భేషరతుగా విడుదల చేయాలని వారు ప్లకార్డులు ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications