మరో 3 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు.. సిద్ధంగా ఉండండి: స్టాలిన్ సంచలనం
తమిళనాడులో సీఎం విజయ్ తనదైన శైలిలో పరిపాలన చేసుకుంటూ వెళ్తున్నారు. టీవీకే పార్టీ పెట్టిన తొలిసారే తమిళనాడులో అఖండ విజయం సాధించి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు విజయ్. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఇప్పటికి 50 రోజులు పూర్తి అయింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు.
అయితే తాజాగా డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని అందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. డీఎంకే పార్టీ స్థాపించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టాలిన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలోనే దాదాపు 5 వేల మంది అన్నాడీఎంకే నేతలు మాజీ అన్నాడీఎంకే మంత్రి బెంజమిన్ నేతృత్వంలో ఇవాళ డీఎంకే పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ .. వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు మాట్లాడుతూ.. " ఈ రోజు డీఎంకే పార్టీ 75 సంవత్సరాల వేడుక జరుపుకుంటోంది. ఈ పార్టీ తమిళనాడులో ఆరుసార్లు విజయం సాధించింది. ప్రజల మన్నలను పొందింది. మీరు ఈ రోజు డీఎంకే ఉద్యమంలో చేరుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది" అని స్టాలిన్ అన్నారు. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లేదని స్పష్టం చేశారు. కూటమి పార్టీల మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తోందని అన్నారు.

అందువల్ల రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పాలన ఎన్నాళ్లు సాగుతుందో చెప్పలేమని డీఎంకే అధినేత స్టాలిన్ పేర్కొన్నారు. రాబోయే 3 నెలలు లేదా 6 నెలల్లో అంటే ఎప్పుడైనా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చని స్టాలిన్ పేర్కొన్నారు. అందువల్ల రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు డీఎంకే పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీవీకే పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలు, రైతుల నిరసనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. అయితే ప్రస్తుతం స్టాలిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications