జగన్ వినకే ఓటమి, ఇలా చేద్దాం - వైసీపీకి సీనియర్ నేత పిలుపు..!!
ఏపీ ఎన్నికల ఫలితాలు వైసీపీ నేతలకు అంతు చిక్కటం లేదు. ఇంకా ఫలితాల షాక్ నుంచి సీనియర్లు బయటకు రాలేకపోతున్నారు. ఓటమి కారణాల పై విశ్లేషణలు చేస్తున్నారు. తమ స్వీయ తప్పిదాలే ఓటమి కి ప్రధాన కారణాలుగా గుర్తిస్తున్నారు. ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారో సీనియర్లు ఓపెన్ అవుతున్నారు. అదే సమయంలో జగన్ వ్యవహార శైలి చర్చకు వస్తోంది. ఇక..పార్టీ నేతలు ఏం చేయాలో సీనియర్లు చేస్తున్న సూచనలు ఆసక్తి కరంగా మారాయి.
ఓటమికి కారణాలు
వైసీపీ ఓటమి పై సీనియర్లు గళం విప్పుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ అయిదేళ్ల పాలనలో తప్పులు జరిగాయని అంగీకరించారు. ప్రజావేదిక కూల్చటం ప్రజలకు నచ్చలేదని చెప్పారు. తప్పులను సరిదిద్దుకోని కారణంగానే ఎన్నికల్లో ఓటర్లు తమను తిరస్కరించారని చెప్పుకొచ్చారు. వ్యవస్థాగతంగా, పాలనాపరంగా చేసిన తప్పిదాలే ఓటమికి కారణాలుగా ధర్మశ్రీ పేర్కొన్నారు. చోడవరంలో తన ఓటమికి బీఎన్ రహదారి గోతులే ప్రధాన కారణమని విశ్లేషించారు.

జగన్ వినలేదు
ఎన్నికలకు ముందు జగన్ కు ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోలేదన్నారు. ఫలితంగానే భారీ ఓట్ల తేడాతో ఓడిపోవాల్సి వచ్చిందని చెప్పారు. రెండు కోట్ల రూపాయాలు రోడ్డు కోసం ఖర్చు చేసానన్నారు. కూటమి ప్రభుత్వం ఆ డబ్బులు ఇస్తుందో లేదో తెలియదన్నారు. నాడు తెలిసో..తెలియకో చేసిన తప్పుల కారణంగానే ప్రజలు తమను అధికారానికి దూరం చేసారని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తామంతా అంగీకరించామని స్పష్టం చేసారు. అవే తప్పులు చేస్తూ మీరూ అలాంటి ప్రజా తీర్పే కోరుకుంటారా అని టీడీపీ నేతలను ధర్మశ్రీ ప్రశ్నించారు.

ఇలా చేయండి
వైసీపీకి చెందిన సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీ,జెడ్పీటీసీ సభ్యులు ..ఇక నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే స్వాగతం పలికి వారితో కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఆహ్వానం లేకపోతే వెళ్లడం, వెళ్లకపోవటం వారి ఇష్టమని వ్యాఖ్యానించారు. ప్రజలు కూల్చివేతలు, కక్ష్యపూరిత రాజకీయాలకు మద్దతు ఇవ్వరని పేర్కొన్నారు. వైసీపీ కార్యాలయాలను కూల్చాలని చూడటం కూటమి ప్రభుత్వానికి సరి కాదని ధర్మశ్రీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో ఆసక్తి కర చర్చగా మారాయి.












Click it and Unblock the Notifications