కాంగ్రెసులో విలీనం లేదు, పొత్తులకు కమిటీ: కెసిఆర్

హైదరాబాద్: కాంగ్రెసులో విలీనం అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు స్పష్టత ఇచ్చారు. కాంగ్రెసు పార్టీలో విలీనం చేయబోమని ఆయన చెప్పారు. ఇతర పార్టీలతో పొత్తుల కోసం కమిటీని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఐదుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలు, పార్టీ శ్రేణులు విలీనానికి అంగీకరించడం లేదని ఆయన చెప్పారు. తెరాసను కాంగ్రెసులో విలీనం చేయాలని సోనియా గాంధీ ఎప్పుడూ అడగలేదని ఆయన అన్నారు.

K Chandrasekhar Rao

తెలంగాణకు గొంతు ఉండాలని, అందుకే పార్టీని విలీనం చేయకూడదని నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. సుదీర్ఘంగా జరిగిన పార్టీ పోలిట్‌బ్యూరో, పార్టీ విస్తృత స్థాయి సమావేశానంతరం కెసిఆర్ సోమవారం రాత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విభజన విషయంలో తాము అడిగింది ఏదీ తెలంగాణకు ఇవ్వలేదని ఆయన కాంగ్రెసు పార్టీని తప్పు పట్టారు. తమకు చెప్పకుండా తమ పార్టీ సభ్యులను కాంగ్రెసులో చేర్చుకున్నారని ఆయన అన్నారు.

ఒక సందర్భంలో గత సెప్టెంబర్‌లో తెలంగాణ ఇస్తే చాలు, పార్టీని విలీనం చేస్తానని చెప్పానని, అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని కెసిఆర్ చెప్పారు. సీమాంధ్రకు ప్యాకేజీ ఇచ్చినా ఫరవాలేదు తెలంగాణకు కూడా ఇవ్వాలని అడిగామని, కానీ పట్టించుకోలేదని ఆయన అన్నారు. షరతులు లేని తెలంగాణ ఇస్తే విలీనం చేస్తానని చెప్పానని, కానీ షరతులతో కూడిన తెలంగాణ ఇచ్చారని ఆయన అన్నారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలపడం సరైంది కాదని ఆయన అన్నారు.

తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి చాలా మార్గాలుంటాయని ఆయన చెప్పారు. తెలంగాణకు తొలి దళితుడు సిఎం అవుతారని చెప్పారుగా, కట్టుబడి ఉంటారా అని అడిగితే ఇప్పుడెందుకు, ఎన్నికలైన తర్వాత చూద్దామని కెసిఆర్ అన్నారు. ఇప్పుడు తెరాస పక్కా రాజకీయ పార్టీ అని ఆయన అన్నారు. సీమాంధ్రలో రెండు ప్రాంతీయ పార్టీలున్నప్పుడు తెలంగాణలో ఒక్క ప్రాంతీయ పార్టీ ఉండకూడదా అని ఆయన అడిగారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని ఆయన అన్నారు.

తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని అనుకునేవారు కమిటీని కలవాలని ఆయన అన్నారు. తెలంగాణలో తెరాస విజయం సాధించాలని, సర్వేలన్నీ తమకు అనుకూలంగానే ఉన్నాయని ఆయన చెప్పారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీకి కె. కేశవ రావు నేతృత్వం వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో తాము 14 లోకసభ స్థానాలు గెలుస్తామని సర్వేలు తేల్చాయని కెసిఆర్ చెప్పారు. తమకు వంద అసెంబ్లీ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదన రాగానే తమ పిలుపు మేరకు వేలాది మంది ఆందోళనకు దిగడంతో కాంగ్రెసు వెనక్కి తగ్గిందని ఆయన అన్నారు.

కేంద్ర మంత్రి జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెసు పద్ధతి సరిగా లేదని ఆయన అన్నారు. విభజన సందర్భంలో ఏ విషయంలోనూ తమను సంప్రదించలేదని ఆయన చెప్పారు. బిల్లు రూపకల్పనలో తమను పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. తాము అడిగినవి ఏవీ కాంగ్రెసు ఇవ్వలేదని, ఎన్టీపిసి నుంచి అదనపు విద్యుత్తు ఇవ్వలేదని, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదని ఆయన అన్నారు. సోనియా గాంధీని కొంత మంది నాయకులు తప్పుదారి పట్టించారని ఆయన అన్నారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెసు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్పారు.

తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత భద్రాచలం మండలాలను సీమాంధ్రలో కలుపుతూ ఎలా ఆర్డినెన్స్ జారీ చేస్తారని ఆయన అడిగారు. తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం కూడా ఆరక ముందే ఆర్డినెన్స్ జారీ చేశారని ఆయన విమర్శించారు. తెలంగాణలోని వెనకబడిన ప్రాంతాలకు కూడా ఏమీ ఇవ్వలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+