కేసీఆర్ కు ఇప్పుడు సీమాంధ్ర వేయించిన జీడిపప్పు లాంటిది!?
2014కు ముందువరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను సీమాంధ్రతోపాటు తెలంగాణకు చెందిన నేతలు కూడా పరిపాలించారు. పి.వి.నరసింహారావు, అంజయ్య, మర్రి చెన్నారెడ్డిలాంటివారు సుపరిపాలన అందించారు. వాస్తవానికి ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులపై ఆధారపడివుంటుంది. ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు రాష్ట్రం మొత్తాన్ని ఒకేలా చూస్తారు.

స్థానిక ప్రజాప్రతినిధులను వదిలేశారే?
ప్రత్యేక తెలంగాణ ఏర్పడకముందే సీమాంధ్ర, తెలంగాణ సమాంతరంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఉద్యమ పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్ తోపాటు ఆ పార్టీ నేతలు, జేఏసీ చైర్మన్ గా పనిచేసిన ఆచార్య కోదండరాంలాంటివారు సీమాంధ్రులను, రాష్ట్రాన్ని పరిపాలించిన సీమాంధ్ర నేతలను అసభ్య పదజాలంతో దూషించారు. వందల సంఖ్యలో కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులను వదిలేశారు.

గాయపడ్డ సీమాంధ్రుల మనసులు!
అప్పట్లో కేసీఆర్ సీమాంధ్రులపై విషం చిమ్మడంతోపాటు వారి ఆహారం, సంస్కృతిని ఎగతాళి చేసేలా మాట్లాడారు. అవసరం ఉన్నా లేకపోయినా అసభ్య పదజాలంతో దూషించడంవల్ల సీమాంధ్రులంతా బాధపడేవారు. ప్రత్యేక తెలంగాణ కోసం అలా అంటున్నారనుకున్నా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నికల్లో గెలవడంకోసం సీమాంధ్రులు అనే బూచి చూపించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు.
ఇవన్నీ సీమాంధ్రుల మనసులను గాయపరిచాయి. కాలక్రమేణా విభజన తర్వాత ఎవరి విధుల్లో వారున్నారు. టీఆర్ఎస్ పేరు మార్చి భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడంతో కేసీఆర్ ఇప్పుడు సీమాంధ్రుల నోళ్లలో నానుతున్నారు. జాతీయ పార్టీగా రూపాంతరం చెందాలంటే 1968 కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీగా గుర్తింపు పొందాలి. లేదంటే కనీసం నలుగురు ఎంపీ అభ్యర్థులతోపాటు నాలుగు రాష్ట్రాల్లో ఆరుశాతం ఓట్లు సాధించాలి.

కాలమే సమాధానం చెప్పాలి!
పొరుగునే ఉన్న ఏపీ అయితే కీలకంగా మారుతుందని కేసీఆర్ అంచనా వేశారు. కానీ ఉద్యమ సమయంలో తాను మాట్లాడిన భాష, వాడిన పదజాలం ప్రజలు మర్చిపోలేదని, వారికి రాష్ట్రం విడదీయడమే నచ్చదని కేసీఆర్ కు తెలుసు. కానీ ఏపీలో కులం కోసం ఎంత దూరమైన వస్తారనే బలహీనతను ఆయన పట్టుకుంటున్నారు.
తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు ఆంధ్రాలో కూడా ఆయన పాగా వేయడానికి సిద్ధమవుతున్నారు. కేసీఆర్ ఏపీలో ప్రచారం చేస్తారా? ఓట్లు వేయమని ప్రజలను అడుగుతారా? రాష్ట్రం విడిపోయినా ఇంకా నలుగుతున్న సమస్యలకు పరిష్కారం కనుగొంటారా? వాటి పరిష్కారానికి ముందుకు వస్తారా? లాంటివన్నీ సందేహాస్పదంగానే మిగిలిపోతున్నాయి. కాలమే వీటికి సమాధానం చెప్పనుంది.












Click it and Unblock the Notifications