చంద్రబాబు - పవన్ మూలాలపై కేసీఆర్ గురి : బీఆర్ఎస్ లో చేరికలు - లెక్క పక్కా..!?
ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కేసీఆర్ ప్రారంభించిన బీఆర్ఎస్ లో ఏపీ నేతలు చేరుతున్నారు. ఏపీ బీఆర్ఎస్ శాఖ బాధ్యతలను మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ కు అప్పగించనున్నారు. ఆయన గతంలో ప్రజారాజ్యం..జనసేనలో కీలకంగా వ్యవహరించారు. సామాజిక వర్గాల ప్రభావం ఏపీ రాజకీయాల్లో కీలకం కావటంతో సీఎం కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీ - జనసేన ఆశలు పెట్టుకున్న వర్గాలు - ప్రాంతాల పైన కేసీఆర్ గురి పెట్టారు. తెలంగాణలో చంద్రబాబు రీ ఎంట్రీ తో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి.

బీఆర్ఎస్ లోకి ఏపీ నేతల చేరిక..
బీఆర్ఎస్ ఆవిర్భావం తరువా ఏపీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ..జనసేనలో కీలక పదవులు నిర్వహించిన నేతలు ఈ రోజు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. మెగా కుటుంబానికి సన్నిహితుడుగా పేరున్న జనసేన మాజీ నేత తోట చంద్రశేఖర్ ఏపీ బీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తోట చంద్రశేఖర్ తో పాటుగా టీడీపీ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఆయనతో పాటుగా మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్ధసారధి బీఆర్ఎస్ లో చేరనున్నారు. వారితో పాటుగా గోదావరి జిల్లాలకు చెందిన పలువురు కాపు - ఎస్సీ నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. వీరితో కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నేతలు మంతనాలు సాగిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ చేరికలు కొత్త మలుపుకు కారణం అవుతున్నాయి. హైదరాబాద్ లో తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ జెండాలో భారీ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి.

టీడీపీ - జనసేన మూలాలపై గురి పెట్టారా
తెలంగాణలో మొదలైన చంద్రబాబు వర్సస్ కేసీఆర్ పొలిటికల్ ఫైట్ ఇప్పుడూ కొనసాగుతోంది. తెలంగాణలో తిరిగి పార్టీకి పూర్వ వైభవం పేరుతో బీజేపీకి చంద్రబాబు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారనేది బీఆర్ఎస్ నేతల ఆరోపణ. ఇదే సమయంలో చంద్రబాబుతో పాటుగా పొత్తు ఖాయమని భావిస్తున్న జనసేన మూలాల పైన కేసీఆర్ గురి పెట్టారు. కాపు ఓటింగ్.. గోదావరి జిల్లాలను ఎంపిక చేసుకోవటం వెనుక కేసీఆర్ లక్ష్యం స్పష్టం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో కాపు వర్గం ప్రధానంగా జనసేనకు మద్దతిస్తుందనే వాదన వినిపిస్తోంది. దీని ద్వారా ఆ ఓటింగ్ లో చీలక దిశగా ఏపీలోని కాపు నేతలకు బీఆర్ఎస్ గాలం వేస్తుందనే చర్చ మొదలైంది. టీడీపీ - జనసేన పొత్తు ఖరారైతే ప్రధానంగా ప్రభావం చూపేది గోదావరి జిల్లాలు. దీంతో, తొలి అడుగులోనే కేసీఆర్ ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నేతలను పార్టీలోకి ఆహ్వానించటం..వారికి బాధ్యతలు అప్పగించేలా కార్యాచరణ సిద్దం చేసారు.

కేసీఆర్ లక్ష్యం సక్సెస్ అయ్యేనా..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో బీఆర్ఎస్ ద్వారా వేస్తున్న రాజకీయ అడుగుల లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తోంది. అందులో భాగంగా ఈ సారి కీలకంగా మారుతున్న కాపు ఓటింగ్ పైన ఫోకస్ పెట్టారు. కాపు సామాజిక వర్గంలో..జనసేన మూలాల పైన తోట చంద్రశేఖర్ కు పూర్తి పట్టు ఉంది. ఆయనకు ఇప్పుడు బీఆర్ఎస్ ఏపీ విభాగ అధ్యక్ష పదవి అప్పగించటం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ఏపీలో రెండు ప్రధాన సామాజిక వర్గాల వారే అధికారం చెలాయిస్తున్నారనే చర్చ కొంత కాలంగా బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు పవన్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే ఏపీలో కేసీఆర్ తన పార్టీ అధ్యక్షుడిగా ఖరారు చేసారు. తొలి చేరికల్లోనే గోదావరి జిల్లాల నేతలు ఎక్కువ సంఖ్యలో ఉండటం కూడా ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపుకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. అటు తెలంగాణ పైన టీడీపీ లో తమను దెబ్బ తీసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని భావిస్తున్న బీఆర్ఎస్..ఏపీలో టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications