ముఖ్య అతిథి: వచ్చే వారం సింగపూర్‌కు సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వచ్చే వారం సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. తెలంగాణ అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఆయన సింగపూర్‌లో పర్యటించి, అక్కడి పారిశ్రామికి పాలసీని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. తెలంగాణలో సింగిల్ విండో పాలసీ ద్వారా అత్యున్నత పారిశ్రామిక విధానాన్ని అమలు చేయాలని తెలంగాన ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఆగస్టు 22, 23 తేదీల్లో సింగపూర్‌లో జరగనున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి కెసిఆర్ హాజరవుతారు. ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఈ సమ్మేళనంలో పాల్గొనేందుకు మనదేశం నుంచి ముఖ్య అతిథిగా ఆహ్వానం అందుకున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో సింగపూర్ ప్రధాని లీ హజైన్‌లూంగ్, ఐఐఎం అధ్యక్షుడు ఎస్ఆర్ నాథన్ కూడా పాల్గొంటారు.

సింగపూర్ పర్యటనలో అక్కడి పారిశ్రామిక విధానం అమలు తీరుతెన్నులు నేరుగా పరిశీలించాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, పరిశ్రమల శాఖ కమిషనర్ జయేశ్ రంజన్ ఆగస్టు 20న సింగపూర్ పర్యటనకు వెళ్తుండగా.. ఆ మరుసటి రోజు (ఆగస్టు 21)న కెసిఆర్ వెళ్లే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి కెసిఆర్‌తోపాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, మరో మంత్రి కూడా ఆయనతోపాటు వెళ్తారని తెలిసింది. మూడు నాలుగు రోజులపాటు సింగపూర్‌లో ఉండి అక్కడి పారిశ్రామిక పాలసీపై అధ్యయనం చేయనున్నామని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర తెలిపారు. అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండే విధంగా పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications