పిట్ట బెదిరింపులు: సిబిఐ దర్యాఫ్తుపై కెసిఆర్ వ్యాఖ్యలు
మహబూబ్ నగర్: సిబిఐ కేసు పైన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం స్పందించారు. తన ఆస్తుల పైన సిబిఐ విచారణ జరిపితే స్వాగతిస్తానని చెప్పారు. ఇలాంటి కుట్రలు, కేసులకు తాను భయపడే ప్రసక్తి లేదన్నారు. ఇలాంటి పిట్ట బెదిరింపులకు కెసిఆర్ భయపడడని, ఇది కాంగ్రెసు పార్టీ కుట్రేనని ఆరోపించారు. తాను నిప్పులా బతికానని, ఎవరు ఏం చేయలేరన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలులో కెసిఆర్ బహిరంగ సభలో మాట్లాడారు బిజెపికి ఎట్టి పరిస్థితుల్లో మద్దతివ్వమని, కేంద్రంలో మూడో ఫ్రంట్ అధికారంలోకి వస్తుందన్నారు. తెరాస అధికారంలోకి వస్తే రూ.10 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. దేశం గర్వపడేలా పక్కా ఇళ్లు కట్టిస్తానన్నారు.

గతంలో తీసుకున్న రుణాలు మాఫీ చేస్తానని చెప్పారు. కాంగ్రెసు పార్టీని గెలిపిస్తే తెలంగాణ సర్వనాశనం అవుతుందన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తనకు శ్రీరామ రక్ష అన్నారు. నాగర్ కర్నూలును జిల్లా కేంద్రంగా చేస్తామన్నారు. తెలంగాణలో 24 జిల్లాలు చేస్తామని చెప్పారు.
సోనియాదే బాధ్యత: మందా
తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీనే బాధ్యత వహించాలని తెరాస నేత మందా జగన్నాథం అన్నారు. సోనియా మొండి వైఖరి వల్లే ఇంత మంది ప్రాణాలు అర్పించాల్సి వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సంపూర్ణ తెలంగాణ కాదని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణం తెరాసతోనే సాధ్యమని చెప్పారు.
తెరాస దొరల పార్టీ: జైరాం రమేష్
తెలంగాణ రాష్ట్ర సమితి దొరల పార్టీ అని, ఆ పార్టీని తెలంగాణ ప్రజలు ఓడించాలని కేంద్రమంత్రి జైరాం రమేష్ పిలుపు ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జిల్లాలోని బోథ్‌లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాఫీ చేస్తామని, కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చిందని, సోనియా తెలంగాణ తల్లి అన్నారు. తెరాసను గెలిపిస్తే అభివృద్ధి జరగదన్నారు.












Click it and Unblock the Notifications