కేశినేని బ్రదర్స్ పోరులో గెలిచేదెవరు ? తాజా లెక్కలేంటి ?
ఏపీలో ఈసారి కూడా విజయవాడ ఎంపీ సీటు ఎన్నిక హోరాహోరీగా సాగబోతోంది. గత కొన్ని దశాబ్దాలుగా బెజవాడలో ఏ పార్టీ అయినా కమ్మ సామాజిక వర్గ నేతలకే టికెట్లు కేటాయిస్తున్నాయి. ఈసారి కూడా కమ్మ సామాజిక వర్గ నేతల మధ్యే విజయవాడ ఎంపీ పోరు ఉండబోతోంది. అయితే దీనికి అదనంగా కేశినేని సోదరుల మధ్య పోరు ఆసక్తి రేపుతోంది. గతంలో వైసీపీ ఎంపీ అభ్యర్ధులపై రెండుసార్లు గెలిచిన కేశినేని నాని ఈసారి తానే వైసీపీ నుంచి బరిలోకి దిగి టీడీపీ అభ్యర్ధికి సవాల్ విసురుతున్నారు.
విజయవాడ ఎంపీ సీటులో గెలవాలంటే కొన్ని ఈక్వేషన్స్ తప్పనిసరి అని గత కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న పరిణామాలు నిరూపించాయి. వీటికి భిన్నం 2004, 2009 ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ విజయాలు మాత్రమే. దీన్ని మినహాయిస్తే సంప్రదాయ కమ్మ సామాజిక ఓటు బ్యాంకు మద్దతు కలిగిన టీడీపీ విజయవాడ లోక్ సభ సీటులో అప్రతిహత విజయాలు సాధించింది. అంతెందుకు గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్ధిగానే కేశినేని నాని ఎంపీగా గెలిచారు. కానీ ఈసారి ఆయన వైసీపీలోకి ఫిరాయించారు.

పదేళ్లుగా విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని 2019లో గెలిచిన తర్వాత పార్టీ కంటే తానే ముఖ్యం అన్నట్లుగా వ్యవహరించడం, చంద్రబాబును సైతం లెక్కచేయకపోవడం వంటి కారణాలతో పార్టీకి దూరమవుతూ వచ్చారు. అదే సమయంలో ఈ శూన్యతను ఆయన సోదరుడు కేశినేని చిన్ని భర్తీ చేయడం మొదలుపెట్టేశారు. గతంలో కేశినేని నాని విజయాల్లో కీలకమైన చిన్ని మారిన పరిస్ధితుల్లో తన స్ధానం ఆక్రమించేందుకు చేస్తున్న ప్రయత్నాలతో నాని దూరం పెట్టారు. చివరికి కేశినేని టీడీపీలో ఉక్కపోత భరించలేక వైసీపీలోకి వెళ్తే ఆయన సోదరుడు చిన్ని తన ఎంపీ సీటులో టీడీపీ అభ్యర్ధిగా మారిపోయారు.
ఇప్పుడు కేశినేని బ్రదర్స్ లో సంప్రదాయ కమ్మ ఓటు బ్యాంకు మద్దతు ఎవరికి లభిస్తే వారు ఈసారి ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా గెలవడం ఖాయం. అయితే వైసీపీలోకి వెళ్లగానే టీడీపీ ఖాళీ అవుతుందంటూ నాని చేసిన వ్యాఖ్యల డొల్లతనం బయటపడేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. టీడీపీ నుంచి ఆయన వర్గంగా పేరున్న నేతలెవరూ నాని వెంట నడవలేదు. దీంతో సోదరుడు చిన్ని మరింత దూకుడుగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇప్పుడు వైసీపీలోకి వెళ్లిన నానిని కాదని కమ్మ సామాజిక వర్గం అంతా చిన్ని వెంట ర్యాలీ కావడం మొదలుపెట్టేసింది. క్షేత్రస్దాయిలో పరిస్దితుల్ని గమనిస్తే ఇదే అర్దమవుతుంది.
విజయవాడ నగరంలో టీడీపీని కాదని వైసీపీకి కమ్మ సామాజిక వర్గం అండ లభంచడం కష్టమే. అందులోనూ విజయవాడ సిటీ పరిధిలోని మూడు సీట్లతో పాటు జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు, నందిగామలో ఈసారి వైసీపీకి ఆధిక్యత కష్టమేనన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మైలవరం, తిరువూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ టికెట్లు ఇవ్వకపోవడం, సిటీ పరిధిలోనూ సెంట్రల్ కు వెల్లంపల్లి శ్రీనివాస్ ను పంపడం, పశ్చిమలో బలహీన అభ్యర్ధి, తూర్పులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వంటి కారణాలు నానికి సమస్యగా మారాయి. వీటిని నాని ఎంతవరకూ అధిగమిస్తారనే దానిపై హ్యాట్రిక్ ఆధారపడుతుంది.












Click it and Unblock the Notifications