కేశినేని నానికి 100 కోట్ల పరువునష్టం నోటీసులిచ్చిన కేశినేని చిన్ని-లక్ష కోట్లైనా డోంట్ కేర్..!
విజయవాడలో కేశినేని సోదరుల మధ్య వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇలాంటి తరుణంలో విశాఖలో కూటమి ప్రభుత్వం ఉర్సా క్లస్టర్స్ కు చౌకగా చేసిన భూకేటాయింపుల వెనుక కేశినేని చిన్ని ఉన్నారంటూ నాని చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. దీనిపై స్పందించి ఉర్సా క్లస్టర్స్ కు భూకేటాయింపుల్ని చిన్ని సమర్ధించుకున్నారు. అంతే కాదు తనపై ఆరోపణలు చేసిన సోదరుడు నానికి పరువు నష్టం నోటీసులు పంపారు.
ఉర్సా క్లస్టర్స్ కు విశాఖలో కేటాయించిన భూమిని రద్దు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు కేశినేని నాని గతంలో లేఖ రాశారు. ఇందులో కేశినేని చిన్నితో ఉర్సా క్లస్టర్స్ ప్రమోటర్స్ కు ఉన్న సంబంధాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు ఇదే అంశంపై చిన్ని తన సోదరుడు నానికి 100 కోట్ల మేర పరువునష్టం నోటీసులు పంపారు. ఐదు రోజుల్లోగా తనపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే 100 కోట్ల రూపాయల మేర పరువునష్టం దావా వేయనున్నట్లు అందులో కేశినేని చిన్ని నానిని హెచ్చరించారు.
అయితే ఈ నోటీసుల్ని నాని లైట్ తీసుకున్నారు. నువ్వు 100 కోట్లకు కాదు లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారి పై నా పోరాటం ఆగదు అంటూ కేశినేని నాని ఇవాళ ట్వీట్ చేశారు. అంతే కాదు కేశినేని చిన్ని తనకు పంపిన పరువు నష్టం దావా నోటీసుల్ని కూడా ఎక్స్ లో పోస్టు చేశారు. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) నుండి తనకు ఇప్పుడే లీగల్ నోటీసు అందిందని, ఆయన పరువు నష్టం కోసం రూ.100 కోట్లు డిమాండ్ చేశారని తెలిపారు.

ఇవన్నీ తాను గౌరవనీయ ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖలో చట్టబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తినందున ఇచ్చారన్నారు. విజయవాడ ప్రజలకు 10 సంవత్సరాలు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించే గౌరవం తనకు లభించిందని, మరియు తాను జవాబుదారీతనం, పారదర్శకత, నిజాయితీతో పాలన చేశానని గుర్తుచేశారు. .సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ప్రతి మాటకు నేను కట్టుబడి ఉన్నానని తెలిపారు.
నువ్వు 100 కోట్లకు కాదు లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారి పై నా పోరాటం ఆగదు I have just received a legal notice from Kesineni Sivanath (Chinni), the sitting MP from Vijayawada, demanding Rs. 100 Crores for defamation — all because I raised legitimate… pic.twitter.com/AJdH7CKkoz
— Kesineni Nani (@kesineni_nani) April 25, 2025
ఇది కేవలం లీగల్ నోటీసు కాదని, ఇది విమర్శలను బెదిరించడానికి, మౌనంగా ఉంచడానికి, నోరు మూయించడానికి స్పష్టమైన ప్రయత్నమని కేశినేని నాని తెలిపారు. కానీ తాను మౌనంగా మాత్రం ఉండనన్నారు. ప్రభుత్వ కార్యాలయం ప్రజా పరిశీలనతో వస్తుందని, భూ లావాదేవీలు, పేర్ల దుర్వినియోగం, ఆరోపించిన అక్రమాల గురించి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు, సమాధానాలు ఆశించబడతాయన్నారు. బెదిరింపులు కాదన్నారు.
తాను ఈ నియోజకవర్గానికి గర్వంగా సేవ చేసానని కేశినేని నాని తెలిపారు. తాను దేని కోసం నిలబడ్డానో తనకు తెలుసని, తాను ఇప్పుడు దేనికి వ్యతిరేకంగా నిలబడుతున్నానో కూడా తెలుసని వెల్లడించారు. తాను భయంతో కాదని, వాస్తవాలతో మౌనంగా కాదు, బహిరంగంగా స్పందిస్తానన్నారు. ఖచ్చితంగా, రాజీతో కాదన్నారు. నిజం బెదిరింపులకు భయపడదని, తాను కూడా భయపడనన్నారు.












Click it and Unblock the Notifications