బెజవాడలో మారుతున్న ఈక్వేషన్స్-బీసీ అభ్యర్ధి చర్చపై కేశినేని ఫైర్-టార్గెట్ బుద్ధా..?
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులపై ఏపీలో రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. ఇదే క్రమంలో కొత్త కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా కులాల కుంపట్లతో సాగే ఏపీ రాజకీయాల్లో ఈసారి టికెట్లు ఏ కులానికి ఇవ్వాలన్న దానిపై జరుగుతున్న చర్చలో విజయవాడలోనూ బీసీ అభ్యర్ధి చర్చ తెరపైకి వచ్చింది. ఎంపీ సీటులో ఈసారి బీసీ అభ్యర్ధికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై పార్టీలో జరుగుతున్న చర్చను సిట్టింగ్ కేశినేని నాని బయటపెట్టారు.
వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా బీసీ నేతకు అవకాశం ఇవ్వాలన్న చర్చపై కేశినేని నాని మండిపడ్డారు. నిఖార్సైన బీసీకి బెజవాడ ఎంపీ టిక్కెట్ ఇస్తే సహకరిస్తానని కేశినేని నాని వెల్లడించారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్లల్లో ఉన్న బీసీలకు సహకరించనంటూ బుద్దా వెంకన్నపై నాని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. బెజవాడ ఎంపీ సీటు బీసీకి ఇవ్వాలనే ప్రతిపాదన మంచిదేనని, దాన్ని ఆహ్వానిస్తామని కేశినేని స్పష్టం చేశారు.

ఆర్థికంగా వెనుకబడి, నిజాయితీగా ఉన్న బీసీకి టిక్కెట్ ఇవ్వాలని ఎంపీ కేశినేని నాని పిలుపునిచ్చారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ వంటి కేసుల్లో ఉన్న బీసీలకు టిక్కెట్ ఇస్తే సహకరించనని తేల్చిచెప్పేశారు. ప్రజల్ని హింసించి, కబ్జాలు చేసి, కోట్లాది రూపాయలు సంపాదించిన వాళ్లు బీసీలు కాదన్నారు. బెజవాడ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ లాంటి వాళ్లు మంచి బీసీలు అంటూ కేశినేని వ్యాఖ్యానించారు.
మంచి బీసీ నేత అయితే వాళ్ల కాళ్లకు దండం పెడతానని, మంచి బీసీలు వండి పెడితే వాళ్లింటికి వెళ్లి తింటానంటూ కేశినేని చెప్పుకొచ్చారు. నిజాయితీ గల బీసీలకు ఎంపీగా అవకాశమిస్తే దగ్గరుండి గెలిపించుకుంటామన్నారు. మరోవైపు ప్రజల కోసం, రాష్ట్రం కోసం జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందన్న కేశినేని నాని, ఓటమి భయంతోనే టీడీపీ - జనసేన పొత్తుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పొత్తులనేవి దేశంలో కొత్తేం కాదని, భావసారూప్యత కలిగిన వాళ్లు పొత్తులు పెట్టుకోవడం సహజమేనని టీడీపీ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications