"మోడీ ప్రశ్న కరెక్టే.. కానీ ఏడేళ్లు లేటు..!"- వైసీపీ నేత కేతిరెడ్డి అదిరే పంచ్..!
దేశంలో నిరుద్యోగిత భారీ స్ధాయిలో పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా కార్పోరేట్ కంపెనీల్ని ఉద్దేశించి ప్రధాని మోడీ కీలక ప్రశ్న సంధించారు. అయితే ఆ ప్రశ్న ఆయా కంపెనీల్ని ఏడేళ్ల క్రితమే అడిగి ఉంటే, కాస్తయినా ప్రయోజనం ఉండేదంటూ వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (Kethireddy Venaktrami Reddy) స్పష్టం చేశారు. ఈ మేరకు ఏడేళ్ల తర్వాత ఒక నిజం బయటికి వచ్చిందంటూ కేతిరెడ్డి ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాల్ని ఆయన ప్రస్తావించారు.
కార్పొరేట్ పన్నును 30% నుంచి 22%కి తగ్గించాం, మరి మీరు ఉద్యోగుల జీతాలు పెంచారా? ఉద్యోగుల సంఖ్య పెంచారా? లేదు అంటూ ఫిక్కీ సదస్సులో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి స్వయంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల్ని కేతిరెడ్డి ప్రస్తావించారు. అంటే పన్ను తగ్గింపుతో ఉద్యోగాలు వస్తాయి, జీతాలు పెరుగుతాయి అన్న హామీ నెరవేరలేదని ప్రధానే ఒప్పుకున్నారని తెలిపారు. మరి ఏడేళ్లుగా కార్పొరేట్లకు ఇచ్చిన లక్షల కోట్ల పన్ను మినహాయింపుల భారం మోసింది ఎవరు? సామాన్య ఉద్యోగే అని తేల్చిచెప్పారు.
2019లో కార్పొరేట్ పన్ను తగ్గించినప్పుడు, కంపెనీలు ఆ డబ్బుతో కొత్త పెట్టుబడులు పెడతాయి, ఉద్యోగాలు వస్తాయి, జీతాలు పెరుగుతాయి అన్నారు! కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయని కేతిరెడ్డి తెలిపారు.

విదేశీ పెట్టుబడిదారులు గత నాలుగేళ్లలోనే దాదాపు 180 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు ₹15 లక్షల కోట్లు, దేశం నుంచి వెనక్కి తీసుకెళ్లిపోయారని కేతిరెడ్డి తెలిపారు. అలాగే దేశంలోకి వచ్చే నికర విదేశీ పెట్టుబడులు 2022-23లో 28 బిలియన్ డాలర్లు ఉంటే, 2024-25 నాటికి కేవలం 1 బిలియన్ డాలర్‌కు పడిపోయాయని పేర్కొన్నారు. కార్పొరేట్ పన్ను తగ్గింపుతో కంపెనీల లాభాలు పెరిగాయి. కానీ ఉద్యోగాల కల్పన, జీతాల పెంపు మాత్రం జరగలేదన్నారు. అలాగే ఒక సామాన్య సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జీతంలో పన్ను కోతల తర్వాతే చేతికి డబ్బు వస్తుందని, మళ్లీ తాను ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలోనూ జీఎస్టీ కడతాడని గుర్తుచేశారు. అదే సమయంలో కార్పొరేట్లకు భారీ పన్ను తగ్గింపు. ఫలితంగా దేశ ఆదాయంలో వ్యక్తులు కట్టే ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నును దాటిపోయిందని తెలిపారు. అంటే దేశాన్ని నడిపిస్తున్నది ఉద్యోగి జేబే అన్నారు. పన్ను తగ్గింపు లాభం కార్పొరేట్లకు, పన్ను భారం సామాన్యుడికి. ఇదేనా సబ్‌కా వికాస్? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మేల్కొనండి. పన్ను విధానం పెద్దల లాభాల కోసం కాదు, సామాన్యుడి జీవితం కోసం ఉండాలని కేతిరెడ్డి చురకలు అంటించారు.














Click it and Unblock the Notifications
