మిత్రుడి ప్రేయసి హత్య: దృశ్యం సినిమా చూపించాడు
విశాఖపట్నం: గాజువాక పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి దృశ్యం సినిమా చూపించిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మిత్రుడి కోసం వివాహితను హత్య చేసిన మాడెం ఎర్ని క్రిష్ణను పోలీసులు 43 రోజుల తర్వాత అరెస్టు చేశారు. జోన్ - 2 డిసిపి డాక్టర్ జి. రామ్ గోపాల్ నాయక్ మీడియా సమావేశంలో శుక్రవారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
వివరాలు ఇలా ఉన్నాయి - అక్కిరెడ్డి పాలెంకు చెందిన అనూష అదే ప్రాంతానికి చెందిన శివ అప్పారావును ప్రేమించింది. అయితే అతన్ని కాదని మరో వ్యక్తిని 2010లో ఆమె వివాహం చేసుకుంది. దీంతో శివ అప్పారావు అదే ఏడాది జూన్ 28వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు.

శివ అప్పారావు స్నేహితుడు మాడెం ఎర్ని క్రిష్ట దుబాయ్‌లో ఉద్యోగం చేసేవాడు. మిత్రుడి ఆత్మహత్యతో మనస్తాపానికి గురైన అతను ఉద్యోగం వదిలేసి గాజువాకకు వచ్చాడు. ఆటో కొనుక్కుని తిరుగుతూ ఇటీవల నాతయ్యపాలెంలో అనూషను గుర్తించాడు. అనూష కూతురును పాఠశాలకు తీసుకుని వెళ్తూ పరిచయం చేసుకున్నాడు. దాంతో అనూష తన భర్తను వశీకరణం చేసుకునేందుకు నాటుమందులు కావాలని క్రిష్ణను అడిగింది. దాంతో అతను జులై 30వ తేదీన అనూషను ఆటోలో ఎక్కించుకుని పెందుర్తి, కొత్తవలస, ఆలమండ మీదుగా భీమాలి గ్రామ సమీపంలోని మామిడితోటలోకి తీసుకుని వెళ్లి మాట్లాడాడు.

తన స్నేహితుడి ఆత్మహత్య గురించి చెప్పాడు. దాంతో ఇరువురి మధ్య గొడవ పెరిగింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కేబుల్ వైరుతో ఆమె మెడకు ఉరి బిగించి చంపాడు. ఆ తర్వాత బైక్ కవర్‌లో మూట గట్టి రామభద్రపుర ఆగ్రహారం సమీపంలోని పాడుబడిన బావిలో పడేశాడు.
మృతురాలి శరీరంపై ఉన్న నగలను, ఆమె వద్ద ఉన్న నగదును, సెల్‌ఫోన్‌ను తీసుకుని వెనక్కి వచ్చాడు. పెందుర్తి కరూర్ వైశ్యాబ్యాంకులో బంగారం కుదువ పెట్టి లక్ష రూపాయలు అప్పు తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయాడు. అక్కడ కూకట్‌పల్లిలో ఉన్నాడు.
పోలీసులను తప్పు దోవ పట్టించేందుకు దృశ్యం సినిమాలో మాదిరిగా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. తనతో తీసుకుని వెళ్లి అనూష సెల్‌ఫోన్ ఆన్ చేసి ఉంచాడు. ఆమె ఫోన్‌కు వచ్చిన కాల్స్‌కు సమాధానం చెబుతూ వచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు గాజువాకకు తిరిగి వస్తూ అనూష సెల్‌ఫోన్‌తో పాటు తన సెల్‌ఫోన్‌ను గోదావరి నదిలో పడేశాడు.
అనూష భర్త ఈశ్వర రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు అనూష, క్రిష్ట సెల్‌ఫోన్ల కాల్ డేటా ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు నేరాన్ని అంగీరించినట్లు రాంగోపాల్ నాయక్ చెప్పారు.












Click it and Unblock the Notifications