ఢిల్లీకి కిరణ్ సవాల్, రాష్ట్రం విభజించమంటే: నారాయణ
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తున్నారని, ఆయన అధిష్టానానికి ఎదురు తిరుగుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ బుధవారం న్యూఢిల్లీలో అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెసు పార్టీ రెండు వాదనల వల్ల మరింత ఆందోళన కలుగుతోందన్నారు. అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని తామే సూచించామన్నారు. రాయలసీమ గురించి ఇప్పుడే ఆలోచించాలన్నారు. లేదంటే ఐదేళ్లలో అక్కడా ఉద్యమం ప్రారంభమవుతుందని హెచ్చరించారు.

మంత్రుల బృందం (జివోఎం) భేటీలో పాలక పక్షం వారే ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఎలా అన్నారు. కాంగ్రెసులో రెండు వాదనలు, కిరణ్ కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేయడం చూస్తుంటే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఆందోళన నివృత్తి చేయాల్సిన ప్రభుత్వంలోని వ్యక్తులే ప్రజలను భయపెట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు.
జివోఎం భేటీలో పార్టీలతో విడివిడిగా మాట్లాడటం సరికాదన్నారు. అందరితో కలిసి మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. హైదరాబాదును యూటిగా చేయవద్దంటూ, ప్రత్యేక రాష్ట్రం కావాలని అడిగితే ఎలా అని ఆంటోని తమను ప్రశ్నించారన్నారు. సమస్యను నివృత్తి చేయాల్సిన కాంగ్రెసు ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. రాష్ట్రాన్ని విభజించమంటే కాంగ్రెసు పార్టీ ప్రజలను విభజించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
ఎపి భవన్ రెసిడెంట్ కమిషనర్ తీరు బాగాలేదన్నారు. పదిమంది తెలుగు ఉద్యోగులను తొలగించారని, ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications