రండి: కిరణ్‌కు ఢిల్లీ ఫోన్, నమ్మి దెబ్బతిన్నాం: సిఆర్
హైదరాబాద్/న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది. విభజన నిర్ణయం, ఈ నెల 7న మంత్రుల బృందం (జివోఎం) మరోసారి భేటీ కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి అధిష్టానం నుండి పిలుపు రావడం గమనార్హం. కిరణ్ శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఎల్లుండి ఎపి కాంగ్రెసు పార్టీ పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర సమన్వయ కమిటీ భేటీలో పాల్గొననున్నారు.
నమ్మి దెబ్బతిన్నాం: సిఆర్
విభజన జరగదని తాము నమ్మి దెబ్బతిన్నామని దేవాదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్య వేరుగా అన్నారు. రాయల తెలంగాణకు తాము వ్యతిరేకమన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. విభజన అనివార్యమైతే సీమకు సాగునీరు, భారీ పరిశ్రమలను కేటాయించాలన్నారు. సీమాంధ్రకు 300 టిఎంసీల నీరు కావాలన్నారు.

సమైక్యవాదినే: రాయపాటి
తాను ఎప్పటికీ సమైక్యవాదినేనని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు గుంటూరులో చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి ఆంధ్రప్రదేశ్ పేరును తెలంగాణ ప్రదేశ్‌గా మార్చుకుంటే అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రాన్ని, తెలుగు జాతిని విడగొట్టవద్దన్నారు.
మరోవైపు ఢిల్లీలో కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రధానమంత్రికి తమ తమ నివేదికలు ఇచ్చేందుకు అపాయింటుమెంట్ కోరారు. తెలంగాణ కాంగ్రెసు తరఫున ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పదకొండు అంశాలపై ప్రధానికి నివేదిక సమర్పించనున్నారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు 16 పేజీల రిపోర్టును ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications