పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ స్ట్రగుల్ స్టారే: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బలిజల ఆత్మీయ సమ్మేళనంలో రాజంపేట పార్లమెంట్ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బలిజలందరూ ఐక్యంగా ఉండి వైసీపీని ఓడించాలని కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానని చెప్పారు. అదే విధంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

పవన్ కళ్యాన్ గురించి మాట్లాడుతూ.. తొలి సినిమాతో స్ట్రగుల్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్.. తెలుగు ప్రజలందరి అభిమానంతో పవర్ స్టార్ గా మారారని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్ట్రగుల్ స్టార్‌గానే ఉన్నారని అన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని బలిజలంతా కలిసి గెలిపించి.. రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్‌ను పవర్ స్టార్‌గా నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
బీజేపీ, టీడీపీ, జనసేనను పవన్ కళ్యాణ్ కలిపారని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. 12 ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోడీపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదంటే.. అది ఆయన నిజాయితీకి నిదర్శనమన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. వచ్చే 2029 ఎన్నికల్లో మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఘనత నరేంద్ర మోడీదేనని అన్నారు. ప్రతి ఒక్కరూ పిడికిలి బిగించి.. వైసీపీని ఓడించాలని కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజంపేట పార్లమెంట్ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications