ఎల్లుండి కిరణ్ ధర్నా: వెంకయ్య తిరకాసు, టిపై మోడీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోని ఇందిరా గాంధీ సమాధి శక్తి స్థల్ వద్ద మంగళవారం నుండి దీక్ష చేపడతారని విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ ఆదివారం తెలిపారు. ఇందిర ఆశయాలను కేంద్రానికి చెప్పేందుకు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ఉద్దేశ్యంలో భాగంగానే కిరణ్ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే దీక్ష చేపడితే కేంద్ర మంత్రులు కూడా రాక తప్పదన్నారు. క్షేత్ర స్థాయిలో ఉద్యమ తీవ్రత పెరిగితే కేంద్రమంత్రులు తలొగ్గక తప్పదన్నారు.
మరోవైపు తెలంగాణ ఉద్యమానికి అరవై ఏళ్ల చరిత్ర ఉందని చెప్పడం అబద్దమని రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమం 1999లోనే పుట్టిందని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నిజాం తొత్తులు ప్రారంభించారని, అప్పట్లో తెలంగాణ వారు ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించారని అన్నారు. హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర అసెంబ్లీలో టీబిల్లును తిప్పి పంపినట్టే పార్లమెంటులో కూడా తిప్పి పంపుతామని చెప్పారు.

తెలంగాణపై వెంకయ్య నాయుడు
భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు వెంకయ్య నాయుడు ఆదివారం అనంతపురం జిల్లాలో కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన విభజన అంశంపై స్పందించారు. నీటి ప్రాజెక్టుల అంశాన్ని బిల్లులో ప్రస్తావిస్తేనే కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల్లో జల వివాదాలు ఉండవన్నారు. హైదరాబాదులో ఉండే అందరికీ బిజెపి అండగా నిలుస్తుందన్నారు. హైదరాబాదులో అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారని, దానిని వీడిపోమని చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు.
తాము మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు అందరూ ఆనందించారన్నారు. కానీ కాంగ్రెసు పార్టీ మాత్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. బిజెపి తెలంగాణకు కట్టుబడి ఉందన్నారు. అయితే, సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ సమగ్ర అభివృద్ధికి బిజెపి కృషి చేస్తుందని చెప్పారు. విశాఖలో కూడా ఐటిఐఆర్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రాన్ని భౌగోళికంగా విభజించమంటే కాంగ్రెసు పార్టీ మనుషులను విభజిస్తోందని ధ్వజమెత్తారు.
కాంగ్రెసుకు పోయేకాలం దగ్గరకొచ్చిందని ఈ సమయంలోనైనా కాస్త మంచి పని చేయాలని హితవు పలికారు. సమన్యాయం పేరిట ఇరు ప్రాంతాలను మోసం చేస్తోందన్నారు. యూపిఏ పాలనను దేశ ప్రజలు చీదరించుకుంటున్నారని ధ్వజమెత్తారు. మోడీ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో జై, విజయవాడలో నై, దేనికైనా సై, అదే కాంగ్రెసు ఐ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
పదేళ్లలో తెలంగాణ అంశంపై కాంగ్రెసు పార్టీ ఏం చేసిందో చెప్పాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారన్నారు. ఇరు ప్రాంతాల మధ్య తగవులు పెట్టి తమాషా చూస్తున్నారని మండిపడ్డారు. వేషం, భాష వేరైనా మనమంతా భారతీయులమని, తెలంగాణలో ప్రజలది తప్పుకాదని రెచ్చగొట్టే నాయకులదే అన్నారు. రాష్ట్రాన్ని విభజించమంటే ప్రజలను విభజించి తమాషా చూస్తున్నారన్నారు.
సీమాంధ్రలో ఐఐటి, ఐఐఎం వంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలన్నారు. సీమ అభివృద్ధికి ప్రత్యేకంగా పూనుకోవాలన్నారు. విభజనతో సీమాంధ్రకు కావాల్నిన అంశాలు కాంగ్రెసు నేతలు ముందే చెప్పలేకపోయారన్నారు. రాష్ట్ర విభజన వేరు, ప్రజలను విభజించడం వేరు అన్నారు. సీమాంధ్రకు అన్యాయం చేస్తే కేంద్రాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లనీయమన్నారు.
హోంమంత్రితో సమావేశంలో తెలంగాణకు సరేనన్న పార్టీలు ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. పోలవరాన్ని బహుళార్థక సాధక ప్రాజెక్టుగా బిల్లులో చేర్చాలని, అలాగే అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరువు జల్లాల్లో ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉండేలా బిల్లులో సవరణలు చేయాలన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు.
ప్రేమతో విభజన చేశాం: మోడీ
బిజెపి నేతృత్వంలోని ఎన్డీయో ప్రేమతో మూడు రాష్ట్రాల విభజనను చేపట్టిందని ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ మీరట్‌లో అన్నారు. మీరట్ బహిరంగ సభలో ఆయన ఆదివారం మాట్లాడారు. తాము మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఆయా రాష్ట్రాల ప్రజలు మిఠాయిలు పంచుకున్నారన్నారు. ప్రజలను విభజించి పాలించి అనే కుట్రను కాంగ్రెసు అమలు చేసిందని, కాంగ్రెసు కుట్ర పూరిత వైఖరితో ఆంధ్రప్రదేశ్‌లో ఇరు ప్రాంతాల్లో నిరసనలు వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రాంతాల్లో విద్వేషాలు రేగాయన్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెసు పార్టీ విభజన రాజకీయాలు చేసిందన్నారు.












Click it and Unblock the Notifications