నాపై పోటీచెయ్, డిపాజిట్లు గల్లంతే: ఓవైసీకి కిషన్ సవాల్
హైదరాబాద్: ధైర్యముంటే అంబర్ పేట నియోజకవర్గం నుంచి తనపై పోటీ చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్ పేట ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అంబర్ పేట నుంచి పోటీ చేస్తే అసుదుద్దీన్‌కు డిపాజిట్లు దక్కవని ఆయన అన్నారు.
బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని తనపై పోటీ చేయాలని అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరిన నేపథ్యంలో కిషన్ రెడ్డి పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడంపై ఆలోచించాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.

మార్చి 6న తెలంగాణ అభివృద్ధిపై చర్చించేందుకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉద్యమకారులతో సదస్సు నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. మార్చి 11న హైదరాబాద్ లో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
సీమాంధ్రులకు రక్షణగా ఉంటాం: ఓవైసీ
తెలంగాణలోని సీమాంధ్రులకు ఎంఐఎం పార్టీ రక్షణగా ఉంటుందని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. హైదరాబాద్ నగరంలో సీమాంధ్రులను వేధించేవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సీమాంధ్ర ప్రజలను ఎవరైనా బెదిరింపులకు గురిచేస్తే, బాధితులు ఇంటికి తమ పార్టీ పేరు రాయాలని, అప్పుడు ఎవరు బెదిరిస్తారో చూస్తానని అసదుద్దీన్ చెప్పారు.












Click it and Unblock the Notifications