కొడాలి నాని, పేర్ని నానిల భారీ అవినీతి: పేర్ని నానికి కొల్లు రవీంద్ర ఛాలెంజ్!
మాజీమంత్రి, వైసిపి సీనియర్ నేత పేర్ని నాని పైన కూటమి మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసిపి నేత పేర్ని నాని బందర్ కే కాదు ఈ రాష్ట్రానికే పెద్ద పిచ్చోడు అంటూ ఆయన పేర్ని నాని పైన విమర్శలు చేశారు.
కొడాలి నాని, పేర్ని నాని మంత్రులుగా ఉన్నప్పుడు భారీ అవినీతి
నిన్న పేర్ని నాని కొల్లు రవీంద్ర ను టార్గెట్ చేసి పగటి వేషగాడు అంటూ వ్యాఖ్యలు చేయగా, ఈరోజు పేర్ని నానిని పెద్ద పిచ్చోడు అంటూ ఆయన టార్గెట్ చేశారు. ప్రభుత్వ హయాంలో పేర్ని నాని రవాణా శాఖ మంత్రిగా, కొడాలి నాని పౌరసరఫరాల శాఖ మంత్రిగా భారీ అవినీతికి పాల్పడ్డారని కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు. అమాయకుల పేర్ల మీద కోట్ల రూపాయలు దండుకున్నారని ఆయన ఆరోపించారు.

పేర్ని నానికి కొల్లు రవీంద్ర సవాల్
అవినీతి, అక్రమాల లో వైసిపి నేతలను మించి ఎవరు ముందుకు పోలేరన్నారు. ఇసుక అక్రమాలకు పాల్పడ్డారని తనపైన ఆరోపణలు చేస్తున్నారని దీనిపైన ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మరి పేర్ని నాని కూడా ప్రమాణం చేసేందుకు సిద్ధమేనా అంటూ కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. ప్రజలు చల్లగా ఉంటే జగన్ కు కడుపు మంటగా ఉంటుందని, అందుకే అచ్చోసిన ఆంబోతుల్లా కొందరు వైసీపీనేతలు బరితెగించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
పేర్ని నాని దిగజారిపోయాడు
ఎన్నికలలో గెలిచేందుకు దొంగ పట్టాలు పంపిణీ చేసింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. కులాల మధ్య, కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే స్థాయికి పేర్ని నాని దిగజారారు అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. రప్ప రప్ప నరికే ఏమని చెప్పేవారిని సైకో అంటారా? అలా అనడం తప్పు అని చెప్పే మమ్మల్ని సైకో అంటారా అంటూ కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.
నానికి ఘాటుగా బదులిచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర
ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న పేర్ని నాని కొల్లు రవీంద్ర పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కొల్లు రవీంద్ర మహాతల్లి అని మాట్లాడుతున్నారని, కానీ ఆమె మహానటి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో వాళ్లే గొడవలు సృష్టించి వాళ్లే కేసులు పెట్టి రచ్చ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక మంత్రి కొల్లు రవీంద్ర ను టార్గెట్ చేయడంతో, తాజాగా కొల్లు రవీంద్ర పేర్ని నానికి ఘాటుగా బదులిచ్చారు.












Click it and Unblock the Notifications