వైఎస్ జగన్‌కు బ్లాక్ క్యాట్ కమాండో భద్రత?
YS Jagan: మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో చోటు చేసిన దాడిపై మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుడివాడ అభ్యర్థి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. ఒక వ్యూహం ప్రకారమే ఈ దాడి జరిగిందని ఆరోపించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా దీన్ని ఖండించాల్సిన ప్రతిపక్ష పార్టీల నాయకులు.. సంస్కారహీనంగా జగన్ తనకు తానే దాడి చేయించుకున్నాడంటూ హీనంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 120 నుంచి 130 సీట్లకు పైగా అసెంబ్లీ, 20కి పైగా లోక్‌సభ సీట్లతో అధికారంలోకి రాబోతోందంటూ జాతీయ స్థాయిలో అన్ని సర్వేలూ తేల్చి చెబుతున్నాయని, దీన్ని చూసి తట్టుకోలేక ఈ దాడి చేశారని ఆరోపించారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు చెందిన 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున నిలబెట్టారనే కక్షతోనే జగన్‌పై పెత్తందారులు ఈ దాడి చేశారని ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రి ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడట్లేదంటే ఈ దాడి వెనుక చాలామంది పెత్తందారులు ఉన్నారని, వాళ్లు ఇచ్చిన ప్రోత్సాహం, డబ్బులతోనే వైఎస్ జగన్‌పై దాడి జరిగిందని పేర్కొన్నారు.
జగన్‌పై రాళ్లతో కొట్టండి అంటూ చంద్రబాబు చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే టీడీపీ నాయకులు, కులోన్మాదంతో విర్రవీగుతున్న ఒక సామాజిక వర్గం కార్యకర్తలు జగన్‌పై దాడి చేశారని అన్నారు. వాళ్లు విసిరిన రాయి జగన్‌కు గాయం చేయడమే కాకుండా పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి తగిలిందని, దీన్ని బట్టి చూస్తే అది ఎంత వేగంతో వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
జగన్ వెళ్లే మార్గంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారంటూ టీడీపీ నాయకులు చెబుతున్న వాదనల్లో అర్థం లేదని కొడాలి నాని అన్నారు. 18 అడుగుల ఎత్తు ఉన్న బస్సుపై నిల్చున్న నాయకులు ఎవరైనా సరే చెయ్యిత్తి ప్రజలకు అభివాదం చేసేటప్పుడు కరెంటు తీగలు తగలకూడదనే ఉద్దేశంతోనే సరఫరా నిలిపివేస్తారని, ప్రధానమంత్రి వెళ్లినా, చంద్రబాబు పర్యటించినా అదే చేస్తారని అన్నారు.

జగన్‌పై గత ఎన్నికల ముందు కూడా కోడికత్తితో దాడి జరిగిందని, ఇప్పుడు కూడా ఎన్నికల సమయంలోనే మరోమారు అలాంటి ఉదంతమే చోటు చేసుకుందని కొడాలి నాని గుర్తు చేశారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేక, అంతమొందించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దీన్ని దృష్టిలో ఉంచుకుని జగన్‌కు బ్లాక్ క్యాట్ కమాండోలతో భద్రత కల్పించాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. కొంతమంది ఫోర్ ట్వంటీ గాళ్లకు రాష్ట్రంలో బ్లాక్ క్యాట్ కమెండోలతో భద్రత కల్పిస్తోన్నరని అన్నారు. చంద్రబాబుకు ఎందుకు బ్లాక్ క్యాట్ కమాండో ఎందుకో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications