అన్ని రాష్ట్రాల్లానే: కోదండ, బాబు విభజనవాదే: జూపూడి
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణకు దక్కాల్సిన అధికారాలు, వనరుల విషయంలో అన్యాయం జరిగితే ఊరుకోమని తెలంగాణ జెఏసి ఛైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. ఆయన బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా అన్ని హక్కులు ఉండాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక 13 జిల్లాలకు మాత్రమే సంబంధించినట్లు ఉందని ఆయన అన్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టే సమయంలో మరోసారి ఢిల్లీ వస్తామని ఆయన చెప్పారు. సంపూర్ణమైన తెలంగాణ సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.

బాబు ముమ్మాటికీ విభజనవాదే: జూపూడి
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారని, ఆయన ఈ బాధ్యత ఎందుకు తీసుకున్నారో తెలియడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు అన్నారు. చంద్రబాబు నాయుడు ముమ్మాటికీ విభజన వాదేనని ఆయన అన్నారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. చంద్రబాబుకు సమైక్యవాదినని చెప్పుకునే ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకునే దమ్ముందా?, 18ఏళ్ల రాజకీయం అనుభవం ఏమైందని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రుల బృందానికి మీ వైఖరిని ఎందుకు చెప్పలేకపోతున్నారని చంద్రబాబను ప్రశ్నించారు. వైయస్సార్ పార్టీని గానీ, తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని గానీ విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని జూపూడి అన్నారు.












Click it and Unblock the Notifications