జగన్ క్యాంపు కార్యాలయం వద్దకు కోడి కత్తి శ్రీను ఫ్యామిలీ-బెయిల్ కు ఎన్ఓసీ ఇప్పించాలంటూ..
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టులో అప్పటి విపక్ష నేత వైఎస్ జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి సంచలనం రేపింది. దాడి తర్వాత ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ హైదరాబాద్ వెళ్లి చికిత్స తీసుకున్న వైఎస్ జగన్ ఆ తర్వాత ఆ విషయం పట్టించుకోలేదు. కానీ ఈ దాడికి పాల్పడిన కోడి కత్తి శ్రీను మాత్రం రోడ్డున పడ్డాడు. అతన్ని ఎన్ఐఏ అరెస్టు చేసి జైలుకు పంపింది. ఈ కేసులో బెయిల్ కూడా లభించక అతను జైల్లోనే మగ్గుతున్నాడు.
కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్ ప్రయత్నాలు. సీఎం జగన్ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన తల్లి సావిత్రి..!! pic.twitter.com/GzrY8u8Ifn
— oneindiatelugu (@oneindiatelugu) October 26, 2022
ఈ నేపథ్యంలో కోడి కత్తి శ్రీను కుటుంబ సభ్యులు సీఎం జగన్ ను తమ కుమారుడికి బెయిల్ ఇప్పించేందుకు సహకరించమని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోడి కత్తి శ్రీను బెయిల్ కు అభ్యంతరం లేదని ఎన్ఓసీ ఇస్తే చాలని వారు అడుగుతున్నారు. ఈ మేరకు సీఎం జగన్ ను నేరుగా కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు కోడి కత్తి శ్రీను కుటుంబ సభ్యులు సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చారు.

శ్రీను తల్లితో పాటు తమ్ముడు, లాయర్ కూడా సీఎం క్యాంప్ కార్యాలయం వద్దకు వచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఫిర్యాదుల విభాగం వద్దకు వచ్చిన వీరు.. తమ కుమారుడు బెయిల్ కోసం సీఎం వైఎస్ జగన్ ను ఎన్ఓసీ ఇమ్మని కోరుతున్నారు. వైఎస్ జగన్ పై ఎయిర్ పోర్టులో దాడి కేసులో నాలుగేళ్లుగా శ్రీను జైల్లోనే ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా బెయిల్ తీసుకునేందుకు సహకరించాలని వారు జగన్ ను కోరబోతున్నారు. అయితే ఈ కీలక విషయంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ తనపై దాడి చేసిన నిందితుడి విషయంలో ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications