కేంద్రం నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్- వైఎస్ జగన్ హ్యాపీ..!!
అమరావతి: ఏపీ నుంచి సిలికాన్ సిటీ బెంగళూరుకు మరో జాతీయ రహదారి కనెక్టివిటీ ఏర్పాటు కానుంది. కర్నూలు, హిందూపురం, చిత్తూరు వైపు నుంచి బెంగళూరుకు వెళ్లడానికి ప్రస్తుతం జాతీయ రహదారులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరొకటి ఈ జాబితాలో చేరబోతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. ఈ డీపీఆర్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ముప్పవరం నుంచి..
ప్రకాశం జిల్లాలోని ముప్పవరం నుంచి శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న కోడూరును అనుసంధానించేలా ఇది నిర్మితం కానుంది. కోడూరు వద్ద హైదరాబాద్-బెంగళూరు హైవేను కనెక్ట్ చేసేలా డీపీఆర్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. శ్రీసత్యసాయి జిల్లాలోని గోరంట్ల, ఓబుల దేవర చెరువు, కదిరి మీదుగా నిర్మించడానికి అవసరమైన భూసేకరణ పనులు దాదాపుగా పూర్తవుతున్నాయి.

14 ప్యాకేజీలుగా..
ఈ జాతీయ రహదారి పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ హైవే రూపుదిద్దుకోనుంది. 342 కిలోమీటర్ల పొడవు ఉన్న జాతీయ రహదారి ఇది. 14 ప్యాకేజీలుగా నిర్మించబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పటికే శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలో భూసేకరణ పనులు దాదాపుగా తుదిదశకు చేరుకున్నాయి. అదే సమయంలో కడప జిల్లాలోనూ భూసేకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
పులివెందుల మీదుగా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కడప జిల్లాలోని పులివెందుల, వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల, కమలాపురం, మైదుకూరు, పోరుమామిళ్ల మీదుగా ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం సాగుతుంది. నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం, ప్రకాశం జిల్లా కంభం, పామూరు, కనిగిరి, అద్దంకి మీదుగా ముప్పవరం వరకు రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది. ముప్పవరం అక్కడి జాతీయ రహదారితో దీన్ని కనెక్ట్ చేస్తారు.

హైబ్రీడ్ మోడల్..
శ్రీ సత్యసాయి జిల్లాలోని నేషనల్ హైవే 544జీ బెంగళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ కోడూరు నుంచి వనవోలు వరకు ఆరు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన వరుస ట్వీట్లు చేశారు. హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపినట్లు ఆయన వివరించారు.
భారత్ మాలా కింద..
భారత్ మాలా, ప్రధాని గతిశక్తి పరిధిలో ఫేజ్-1 కింద 912.94 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. ప్యాకేజీ- 1 పరిధిలో కోడూరు నుంచి వనవోలు వరకు 6-లేన్లను అభివృద్ధి చేస్తారు. కేంద్రం నుంచి 912.94 కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడంతో కోడూరు- వనవోలు మధ్య ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన రోడ్డును ఆరు లేన్లుగా విస్తరించడానికి అవసరమైన నిర్మాణ పనులు త్వరలోనే మొదలు కానున్నాయి.

జగన్ హ్యాపీ..
కాగా- కొత్త సంవత్సరం తొలి రోజుల్లోనే విజయవాడ-బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం, ప్యాకేజీ-1 కింద 912.94 కోట్ల రూపాయలను మంజూరు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది వైఎస్ జగన్ కు సంతోషాన్ని కలిగించే సమాచారమే.












Click it and Unblock the Notifications