వైకుంఠ ద్వార దర్శనాలు సమీపించిన వేళ.. తిరుమలలో కీలక ఘట్టం
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 64,729 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,162 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.31 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఎనిమిది కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 23వ తేదీ మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సంవత్సరంలో నాలుగుసార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనాదిగా వస్తోంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఇందులో భాగంగా ఈ నెల 23వ తేదీ తెల్లవారు జామున 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనందనిలయం, ధ్వజస్తంభం, బంగారువాకిలి, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి.. తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. ఆ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు.
శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆ తర్వాతే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీ కృష్ణ ఇందులో పాల్గొననున్నారు.
తిరుమంజనం కారణంగా ఆ రోజున అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దయింది. అలాగే 23న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 22వ తేదీన ఎటువంటి సిఫారసు లేఖలు కూడా స్వీకరించబోమని తెలిపారు.












Click it and Unblock the Notifications