ఎమ్మెల్సీ అనంతబాబు సమస్యను పక్కదారి పట్టించేందుకే కోనసీమ అల్లర్లా??
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యాన్ని హత్యచేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే కోనసీమ అల్లర్లు జరిగాయా? అనే అనుమానాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఒక సమస్య నుంచి పక్కదారి పట్టించేందుకు మరో సమస్యను ప్రభుత్వం సృష్టిస్తోందని ఆరోపించారు.
కోనసీమలో అల్లర్లు జరిగిన సమయంలో ముఖ్యమంత్రి జగన్ దావోస్ పర్యటనలో ఉన్నారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే వెంకటసతీష్‌కుమార్ ఇళ్లపై దాడులు చేసినా ఇంతవరకు వారిని అధికార పార్టీవారెవరూ పరామర్శించలేదని, కోనసీమలో అల్లర్లు జరిగితే డీజీపీ ఇంతవరకు అక్కడ పర్యటించి పరిస్థితిని అంచనా వేయలేదని తెలుగుదేశం, జనసేన నేతలు మండిపడుతున్నారు.

అధికార పార్టీకి సంబంధించి ఒక మంత్రి చొక్కాపై కాకి రెట్టవేసినా నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రభుత్వాధికారులు కూడా ఎంతో హడావిడి చేస్తారని, అటువంటిది ఇళ్లే తగలబెట్టినప్పటికీ ఎటువంటి ఓదార్పు వారికి లభించలేదంటే దీనికి అర్థం ఏమిటో చెప్పాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. పోలీసులు అరెస్ట్ చేసినవారిలో ఎక్కువ మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలే ఉన్నారని, అలాగే మంత్రి ఇంటిపై దాడికి పాల్పడినవారు కూడా ఆయన అనుచరులేనన్నది వీడియో కెమెరాల్లో, సీసీ టీవీల్లో స్పష్టంగా ఉందని తెలుగుదేశం, జనసేన నేతలు చెబుతున్నారు. కేసును నాన్చకుండా నిజమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications