చంద్రబాబుపై పేర్ని పొగడ్తలు వర్కవుట్ కాలేదా ? ఇదే సాక్ష్యం..! పవన్ చెడుగుడు ఎక్స్ ట్రా..
ఏపీలో సీనియర్ రాజకీయవేత్తగా పేరున్న సీఎం చంద్రబాబుపై గతంలో తీవ్ర విమర్శలు గుప్పించిన చరిత్ర ఉన్న వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా హఠాత్తుగా ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. మచిలీపట్నం రేషన్ బియ్యం స్కాంలో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరవుతున్న పేర్ని నాని, ఆయన కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందనే చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో హఠాత్తుగా ప్రత్యక్షమైన పేర్ని నాని అనూహ్యంగా సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.
తన భార్య పేరుతో ఉన్న గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన ఘటనలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల్ని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న తరుణంలో చంద్రబాబు జోక్యం చేసుకున్నారని పేర్ని నాని తాజాగా తెలిపారు. గోడౌన్ కు అసలు ఓనర్ అయిన తన భార్య పేర్ని జయసుధను అరెస్టు చేసేందుకు ఓ మంత్రి గట్టిగా ప్రయత్నం చేసినా సీఎం చంద్రబాబు మాత్రం ఒప్పుకోలేదని పేర్ని వెల్లడించారు. మహిళను అరెస్టు చేయొద్దని, కావాలంటే పేర్నినాని, ఆయన కుమారుడిని అరెస్టు చేయించాలని చెప్పారన్నారు. దటీజ్ చంద్రబాబు అనేశారు.

తద్వారా సీఎం చంద్రబాబుపై ఎప్పుడూ లేనంతగా పేర్నినాని ప్రేమ కురిపించారు. అయితే ఈ వ్యూహం ఆయనకు వర్కవుట్ కాలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవాళ మచిలీపట్నం రేషన్ బియ్యం స్కాంలో కృష్ణాజిల్లా పౌరసరఫరాలశాఖ అధికారితో పాటు పేర్ని గోడౌన్ మేనేజర్ ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు.. వర్కవుట్ కాకపోతే మాత్రం అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు రేషన్ బియ్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్ని నాని భార్య జయసుధకు కృష్ణా జిల్లా జేసీ గీతాంజలి ఇవాళ మరోసారి నోటీసులు ఇచ్చారు. మాయమైన రేషన్ బియ్యం పరిమాణం పెరిగింది కాబట్టి గతంలో చెల్లించిన 1.68 కోట్లకు అదనంగా మరో 1.67 కోట్లు చెల్లించాలని ఆమెకు నోటీసులు పంపారు. దీంతో పేర్ని జయసుధ ఈ మొత్తం చెల్లిస్తారా లేక కోర్టులో తేల్చుకుంటారా చూడాల్సి ఉంది.
మరోవైపు టీడీపీ నేతలు మాత్రం పేర్నినానిని, ఆయన కుటుంబ సభ్యుల్ని వదలొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గతంలో అధికారంలో ఉండగా తమ కుటుంబ సభ్యులను కూడా చూడకుండా ఆడవాళ్ల పేర్లను బయటపెట్టి పేర్నినాని రాక్షసానందం పొందారని వారు చెప్తున్నారు. అలాగే సీఎంవోలో చంద్రబాబు మాట్లాడిన మాటలు పేర్నికి తెలుస్తున్నాయంటే వైసీపీ కోవర్టులు అక్కడ ఉన్నారనే ఆరోపణలు కూడా గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పేర్ని కుటుంబీకుల్ని అరెస్టు చేస్తుందా లేదా చర్చ సాగుతోంది.
అటు చంద్రబాబుపై పేర్ని నాని పొగడ్తలపై ఇవాళ పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. మీరు గతంలో చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లను తిట్టలేదా అని ప్రశ్నించారు. పేర్ని తప్పులే ఆయన కుటుంబాన్ని రోడ్డుపైకి తెచ్చాయన్నారు. రేషన్ బియ్యం మాయమైంది వాస్తవమని, వాటికి డబ్బులు కట్టింది కూడా నిజమని పవన్ తెలిపారు. అసలు ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గోడౌన్ పెట్టిందెవరంటూ పేర్నికి పవన్ ఘాటు కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications