రాజ్‌నాథ్ సింగ్ రాక: మళ్లీ బిజెపిలో చేరిన కృష్ణంరాజు
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి యు.కృష్ణంరాజు తిరిగి బిజెపి గూటికి చేరుకున్నారు. బుధవారం హైదరాబాద్ నగరానికి వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడు సమక్షంలో ఆయన బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.
రాజకీయాల్లోకి ప్రవేశించిన మొదట్లో బిజెపిలో చేరిన కృష్ణంరాజు 12వ లోక్‌సభకు ఆ పార్టీ తరఫున కాకినాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తరువాత 13వ లోక్‌సభకు కూడా నరసాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ మంత్రివర్గంలో స్థానం సంపాదించి కేంద్ర మంత్రిగా పనిచేశారు.

2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన కృష్ణంరాజు రాజమండ్రి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత కొద్ది రోజులుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న కృష్ణంరాజు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తిరిగి పాత పార్టీలోనే చేరేందుకు నిర్ణయించుకున్నారు.
ఇదిలా ఉండగా, గతంలో బిజెపి కేంద్ర నాయకత్వంతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన తిరిగి పార్టీలో చేరే విషయంపై నేరుగా అధిష్టానం పెద్దలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగానే కృష్ణంరాజు బిజెపిలో చేరారు.












Click it and Unblock the Notifications