హామీతోనే బిజెపిలోకి రఘురామ, కాకినాడకు కృష్ణంరాజు
హైదరాబాద్: నరసాపురం లోక్‌సభ స్థానాన్ని ఇస్తేనే పార్టీలో చేరతానని రఘురామ కృష్ణంరాజు భారతీయ జనతా పార్టీ నాయకులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నరసాపురం టిక్కెట్ హామీతోనే ఆయన బిజెపిలో చేరినట్లుగా సమాచారం. తనకు ఆ స్థానాన్ని ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని కూడా ఆయన చెప్పారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్ నుంచి ఈ మేరకు హామీ పొందిన తరువాతే ఆయన బిజెపిలో చేరారట. మరోవైపు మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు కాకినాడ నుంచి పోటీ చేస్తారని బిజెపి నాయకులు చెబుతున్నారు.

బిజెపిలోకి ఎన్టీ చౌదరి
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్టు డైరెక్టర్ పదవులకు రాజీనామా చేసిన ఎన్టీ చౌదరి భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం బిజెపి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు ఆ పార్టీ జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు హాజరవుతున్నారు.
ఆయన సమక్షంలోనే ఎన్టీ చౌదరి కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆయన బిజెపిలో చేరుతున్న సందర్భంగా ఆయన మద్దతుదారులు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. వేలాది మందితో ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అనంతపురం వీధుల్లో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి.












Click it and Unblock the Notifications