ఏపీ, తెలంగాణా నీళ్ళ పంచాయితీ.. 13న కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ!!
తెలుగు రాష్ట్రాల కృష్ణా నదీ జల వివాదాల పరిష్కారం కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ మార్చ్ 13న భేటీ కానుంది.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రం జోక్యం చేసుకున్నప్పటికీ ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య చోటుచేసుకున్న కృష్ణానది, గోదావరి నది జల వివాదాలు సమసి పోలేదు. ఇరు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీకి తెరపడలేదు. ఇక తాజాగా కృష్ణా జలాల పై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించడం కోసం కృష్ణానది యాజమాన్య బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ ఈనెల 13వ తేదీన సమావేశం నిర్వహించనుంది.

ఏపీ నీటి వినియోగంపై తెలంగాణా ప్రభుత్వం కంప్లైంట్
శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి జలాశయాలలో కృష్ణానది జలాల వినియోగంలో ఏపీ అడ్డగోలుగా వ్యవహరిస్తుందని, కేటాయింపులకు మించి నీటిని వాడుకుంటుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తూ కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు కు స్పందించాలని లేఖ రాసింది. 66.34 నిష్పత్తి ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 641.05 టిఎంసిలు, తెలంగాణ రాష్ట్రం 330.23 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవలసి ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఫిబ్రవరి 28 నాటికి 673.60 టీఎంసీల నీటిని ఉపయోగించుకుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది.

తెలంగాణా జల దుర్వినియోగంపై ఏపీ ఫిర్యాదులు
నాగార్జునసాగర్ నుంచి ఏపీ ప్రభుత్వం నీళ్లను వినియోగించకుండా నిలువరించాలని వెంటనే ఆ రాష్ట్రానికి తగు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కు లేఖ రాశారు. ఇక ఇటీవలే కృష్ణ బోర్డుకి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం చేస్తూ నాగార్జునసాగర్, శ్రీశైలం ఉమ్మడి జలాశయాలలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణ బోర్డు అనుమతి లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, దానిని నిలువరించాలని ఏపీ ప్రభుత్వం కూడా కృష్ణ బోర్డుకు లేఖ రాసింది.

ఇరు రాష్ట్రాల మధ్య నీళ్ళ పంచాయితీ పరిష్కారానికి కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
దీంతో ఇరు రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న నదీ జలాల పంచాయితీని పరిష్కరించడం కోసం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ ఈనెల 13వ తేదీన భేటీ కానుంది. రెండు రాష్ట్రాల నుండి జల వనరుల శాఖ అధికారులు ఈ భేటీలో పాల్గొనాల్సి ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించి తదనుగుణంగా త్రిసభ్య కమిటీ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. మరి ఈ భేటీకి ఇరు రాష్ట్రాల నుంచి అధికారులు హాజరవుతారా? త్రి సభ్య కమిటీ ఇరురాష్ట్రాల మధ్య సమస్యను పరిష్కరిస్తుందా? భేటీలో ఏం జరుగుతుంది?అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications