రంగు బయటపడ్తుంది, బాబు జోక్యం అనవసరం: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పోలవరం అంశానికి సంబంధించి టీడీపీ, బీజేపీ, కాంగ్రెసు పార్టీల పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అదే సమయంలో హైదరాబాదు పోలీసు వ్యవస్థ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోక్యం అవసరం లేదన్నారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పోలవరం విషయంలో సోమవారం అన్ని పార్టీల రంగులు బయటపడతాయన్నారు.
రాజ్యసభలో బీజేపీకి ఆధిక్యం లేదని, కాంగ్రెసు పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పోలవరం బిల్లు వీగిపోవడం సులభమే అన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నేతలు పోలవరం ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తున్నారని, వారికి చిత్తశుద్ధి ఉంటే సోనియా గాంధీ ఇంటి ముందు ధర్నా చేసి అయినా బిల్లును అడ్డుకోవాలన్నారు.
కాంగ్రెసు నేతలు కేవలం మాటలకే పరిమితం కావొద్దని హితవు పలికారు. టీడీపీ రాజ్యసభ తెలంగాణ సభ్యులు చంద్రబాబుకు తొత్తులుగా ఉంటారో లేక తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారో వారిష్టమన్నారు. కాంగ్రెసు నేతలు పొన్నాల, జానా, జైపాల్, డీఎస్ వంటి నేతలు పోలవరం బిల్లును రాజ్యసభలో అడ్డుకునేందుకు సోనియా పైన ఒత్తిడి తేవాలన్నారు.

అందుకోసం అవసరమైతే సోనియా ఇంటి ముందు ధర్నా చేయాలన్నారు. రాజ్యసభలో తమ పార్టీకి ఒక్కరే సభ్యులు ఉన్నారని, అయినా ఓటింగు కోసం పట్టుబట్టామన్నారు. బీజేపీకీ రాజ్యసభలో బలం లేనందున కాంగ్రెసు చేతిలోనే ఉందన్నారు. ఇప్పుడు ఆ పార్టీ చిత్తశుద్ధి బయటపడుతుందన్నారు. టీడీపీ తెలంగాణ నేతల రంగు కూడా బయటపడుతుందన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, డిజైన్ మార్చాలని చెబుతున్నామన్నారు. కాంగ్రెసు పార్టీ చేసిన తప్పే బీజేపీ చేస్తే ఇక మన్మోహన్ పోయి మోడీ వచ్చి ఎందుకన్నారు. పోలవరం ప్రాజెక్టును మూడు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. కేంద్రానిది రెండు లక్షల మంది గిరిజనులను ముంచే ప్రయత్నమన్నారు. శాడిస్ట్ ప్రేమ వద్దన్నారు.
రాజ్యసభలో తమకు ఒక్కరు, కాంగ్రెసు పార్టీకి అరవైకి పైగా, టీడీపీకి ముగ్గురు సభ్యులు ఉన్నారన్నారు. పోలవరం బిల్లును కాంగ్రెసు పార్టీ అడ్డుకొని వారే హీరోలు అయినా తమకు అభ్యంతరం లేదన్నారు. క్రెడిట్ వారే తీసుకోవచ్చునని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పైన ఇంకా ఆంధ్రా పెత్తనం కనిపిస్తోందా అనే అనుమానం కలుగుతోందన్నారు.
మోడీ గతంలో ముఖ్యమంత్రిగా పని చేశారని, ఆయన కొన్ని రాష్ట్రాలకు ప్రధానియా లేక అన్ని రాష్ట్రాలకు ప్రధానియా అని భవిష్యత్తులో తెలుస్తుందన్నారు. రాజ్యసభలో చర్చకు పట్టుబట్టాలన్నారు. తెరాస పోరాటానికి బీజేపీ మద్దతివ్వాలన్నారు. రాజ్యసభలో ఓటింగ్ కోరుతామన్నారు. హైదరాబాదు పోలీస్ వ్యవస్థ పైన చంద్రబాబు జోక్యం అనవసరమన్నారు.












Click it and Unblock the Notifications