పొన్నాలపై కెటిఆర్ ఎదురుదాడి: టిడిపిపై హరీష్
హైదరాబాద్: కాంగ్రెసు, బిజెపి తెలంగాణ నాయకులపై తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావు తీవ్రంగా మండిపడ్డారు. ఉనికిని కాపాడుకోడానికే తెలగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య లేఖలు రాస్తున్నారని ఆయన ఎదురుదాడికి దిగారు. బీజేపీ నేత కిషన్‌రెడ్డి విభజన చట్టం చదవకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నిర్ణయాలనే బీజేపీ అమలు చేస్తుందని చెబుతున్నప్పుడు ఇక ఎన్డీయే ప్రభుత్వం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం శరవేగంగా ముందుకు దూసుకుపోతుంటే ఈ రకమైన అవాకులు చెవాకులు పేలడం పొన్నాలకు ఏ రకమైన విజ్ఞత ఉందో ఆలోచించుకోవాలని ఆయన బుధవారం మీడియాతో అన్నారు. బిజెపి నేత కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రికి లేఖలు రాస్తారంట, ఏమని రాస్తారు? హైదరాబాద్‌ను వేరేవాళ్ల చేతిలో పెట్టమని రాస్తారా? అని ఆయన ప్రశ్నించారు. సోనియాగాంధీ తప్పు చేసిందని మాట్లాడుతున్నారు, ఆమె తప్పు చేస్తే ఎన్డీయే ప్రభుత్వం సరిచేయాలని చెప్పమనండి అని కెటిఆర్ సూచించారు.

ఇదిలావుంటే, తెలంగాణ తెలుగుదేశం నాయకులపై నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. హైదరాబాదులో గవర్నర్‌గిరిపై తెలుగుదేశం పార్టీ నాయకులు అభిప్రాయాలు చెప్పాల్సి ఉందని ఆయన బుధవారంనాడు మీడియాతో అన్నారు. గవర్నర్‌గిరిపై అభిప్రాయాలు చెప్పలేని దీనావస్థలో తెలంగాణ టిడిపి ఉందని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో దళితులకు భూపంపిణీ కార్యక్రమం దేశానికే ఆదర్శమని ఆయన అన్నారు. దళితులకు భూపంపిణీ ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభమై ఐదేళ్ల పాటు కొనసాగుతుందని ఆయన మెదక్ జిల్లాలో అన్నారు. దళితులకు మూడెకరాల భూమిని తొలి ఏడాది పెట్టుబడి ఖర్చు ఇస్తామని హరీష్ రావు చెపపారు.
సాగుకు పనికి వచ్చే భూమినే దళితులకు ఇస్తామని ఆయన చెప్పారు. ఆటోలు, ట్రాక్టర్లపై ఉన్న పాత బకాయిలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మరమగ్గం కార్మికులకు ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలేసి రుణమాఫీ చేస్తామని ఆనయ చెప్పారు.












Click it and Unblock the Notifications