లగడపాటి సంచలనం: అధిష్టానంపై ఆగ్రహం, అతనెవరు?
హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ మంగళవారం సంచలన, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత ఢిల్లీలోని హోటల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో మంతనాలు జరిపారని, అధిష్టానం నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి గెలిచేలా జగన్‌తో కలిసి అధిష్టానం కుమ్మక్కైనట్లుగా కనిపిస్తోందన్నారు. దత్తపుత్రుడు జగన్ దొరికాక తాము అధిష్టానానికి పనికి రాకుండా పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు రాకుండా అడ్డుకుంటామన్నారు. విభజన బిల్లుకు వ్యతిరేకంగా జాతీయ పార్టీల నేతలందరినీ కలుస్తామని చెప్పారు.

అధిష్టానం కెసిఆర్, జగన్‌లతో కుమ్మక్కైందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నారని తెలిపారు. అసెంబ్లీలోని ఇరు సభల్లో తిరస్కరణకు గురైన టి బిల్లును ముందు తీసుకెళ్లాలని చూస్తే కుదరదన్నారు. ఇప్పటికే మైనార్టీలో ఉన్న ప్రభుత్వం ఒక్కరోజు కూడా పార్లమెంటును నిర్వహించే సమస్యేలేదని, వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్లమెంటులో తెలుగోడి సత్తా చూపుతామన్నారు.
రాష్ట్రానికి చెందిన ఓ నాయకుడు సలహా మేరకే తమకు వార్ రూం భేటీకి ఆహ్వానం అందలేదన్నారు. రాష్ట్ర కాంగ్రెసులో ఓ ముఖ్యనేత ఇప్పుడు చక్రం తిప్పుతున్నారన్నారు. మునిగిపోయే నావకు ఆయన కెప్టెన్ కావాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. కాగా, లగడపాటి ఆ పేరును వెల్లడించలేదు. విభజనను అడ్డుకునేందుకు తమ వద్ద చాలా అస్త్రాలు ఉన్నాయని చెప్పారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా అత్యధికులు పార్లమెంటులో బిల్లును అడ్డుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. బిల్లును తెచ్చే ప్రయత్నాలు చేస్తే అధిష్టానం పెద్దలు తలలు పట్టుకునేలా చేస్తామన్నారు. విభజన ప్రక్రియను తప్పకుండా ఆపుతామన్నారు.
తమతో ఇతర పార్టీలు కలిసి రావాలన్నారు. ఎవరు కలిసినా కలవకున్నా తమ బలం తమకుందన్నారు. తెలుగోడి దెబ్బ చూపిస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తప్పు చేశాయని ఆరోపించారు. పార్టీలు, జెండాలు పక్కన పెట్టి సమైక్యాంధ్ర అజెండాతో అందరు ముందుకు వెళ్లాలని హితవు పలికారు.












Click it and Unblock the Notifications