చంద్రబాబు నిస్సిగ్గు రాజకీయ పర్వం.. లక్ష్మీపార్వతి ధ్వజం!
పింఛన్ల నుంచి పట్టాదారు పాస్‌పుస్తకాల వరకు చంద్రబాబుది క్రెడిట్ చోరీ అని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. గతంలో చేపట్టిన పనులకే మళ్లీ మళ్లీ ప్రారంభోత్సవాలు చేస్తున్న సీఎం చంద్రబాబు, ఇచ్చిన హామీల అమలును పక్కన పెట్టి కేవలం ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పింఛన్లు, బీసీ రిజర్వేషన్లు, భోగాపురం విమానాశ్రయం, పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతుల సమస్యలు, డీఎస్సీ నియామకాలపై ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దమ్ముంటే సమాధానం చెప్పాలని, అలాగే జగన్ పాలనపై బహిరంగ చర్చకు రావాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి సవాల్ చేశారు. ఒకే పింఛన్ పథకాన్ని 22 సార్లు ప్రారంభించడమేనా అభివృద్ధి? అని ప్రశ్నించారు. కొత్త పింఛన్లు ఇవ్వకుండా, పాత పింఛన్లలో లబ్ధిదారులను తగ్గిస్తూ ప్రచారానికి మాత్రం పెద్దపీట వేస్తున్నారన్నారు.

సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటైనా పూర్తిస్థాయిలో అమలు చేశారా? గ్యాస్ సబ్సిడీ సహా ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి? స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించగానే 34 శాతం బీసీ రిజర్వేషన్ల పేరుతో రాజకీయ ప్రచారం మొదలుపెట్టారని మండిపడ్డారు. బీసీలకు నిజంగా మేలు చేయాలంటే చట్టబద్ధమైన పరిష్కారం చూపాలన్నారు. జగన్ హయాంలో బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, నామినేటెడ్ పదవులు, పనుల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించామన్నారు.
బీసీ సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే ప్రచారానికి పరిమితం కాకుండా ఆచరణలో చూపించాలన్నారు. భోగాపురం విమానాశ్రయానికి భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, నిర్మాణ పనుల పురోగతిలో వైయస్ జగన్ ప్రభుత్వం కీలకంగా పని చేసింది. గతంలో చేపట్టిన పనులకు ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేసి, మొత్తం ఘనతను తన ఖాతాలో వేసుకున్నారన్నారు.
వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో సాంకేతికతను ఉపయోగించి భూముల రీసర్వే చేపట్టి పట్టాదారు పాస్‌పుస్తకాలను రైతులకు అందించామన్నారు. అప్పట్లో వాటిపై దుష్ప్రచారం చేసినవారే ఇప్పుడు మళ్లీ ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. పాస్‌పుస్తకాలపై ఫొటోలు మార్చడం కాదు.. భూముల వివరాల్లో సమస్యలుంటే పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలన్నారు.
రాయలసీమలో కరువు పరిస్థితులు నెలకొని, తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఉద్యానవన రంగానికి లక్ష కోట్లు ఖర్చు చేశామంటూ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంఅన్నారు. కరువు పరిస్థితులను ముందుగానే అంచనా వేసి రైతులకు సాగునీరు అందించే చర్యలు తీసుకోవాలన్నారు. పంటలు ఎండిపోతుంటే సాగునీరు అందించకుండా, పంటలకు మద్దతు ధర కల్పించకుండా అభివృద్ధి గురించి గొప్పలు చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటన్నారు.
డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం ఎప్పుడు? చేస్తారని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కేసులా? ఇదేనా రెడ్‌బుక్ పాలన? అంటూ లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలన్నారు. ఆయన రాలేకపోతే లోకేశ్‌ను పంపాలని డిమాండ్ చేశారు. హామీల అమలుపై సమాధానం చెప్పకుండా పాత ప్రభుత్వంపై నిందలు వేయడం మానుకోవాలన్నారు. ప్రచారంతో ప్రజలను ఎప్పటికీ మభ్యపెట్టలేరన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని నందమూరి లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
