అలిపిరి మెట్ల మార్గంలో మళ్లీ చిరుత కలకలం
Tirumala: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు వెలిసిన తిరుమల శేషాచలం అడవుల్లో చిరుతలు, ఇతర వణ్య ప్రాణుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఏడాది ఆగస్టులో చిరుతల సంచారం శ్రీవారి భక్తులను భయాందోళనలకు గురి చేసింది. 48 గంటల వ్యవధిలో అలిపిరి పరిసర ప్రాంతాల్లో చిరుతలు కనిపించాయి. టీటీడీ అటవీ శాఖ అధికారులు సీసీటీవీ కెమెరాల ద్వారా వాటి సంచారాన్ని గుర్తించారు.
అలిపిరి నుంచి గాలిగోపురం, శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 38వ మలుపు ప్రాంతాలతో పాటు మొత్తం అయిదు చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు. వాటి కదలికలను పసిగట్టడానికి అలిపిరి మార్గంలో గాలి గోపురం నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు సుమారు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్తోన్న నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపిన ఉదంతం అనంతరం టీటీడీ అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. చిరుతల సంచారంపై దృష్టి సారించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా వాటి కదలికపై నిఘా ఉంచారు.
చిరుతల సంచారం పెరగడం వల్ల కాలినడకన వెళ్లే భక్తులకు తక్షణ రక్షణ చర్యగా ఊతకర్రలను అందించారు టీటీడీ అధికారులు. చిన్న పిల్లలు కాలినడకన తిరుమలకు వెళ్లే సమయాన్ని సవరించారు. వారి భద్రత కోసం మెట్లమార్గంలో అదనంగా సిబ్బందిని నియమించారు.
ఈ పరిస్థితుల్లో అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి మెట్ల మార్గం మీదుగా కాలి నడకన తిరుమలకు బయలుదేరి వెళ్లిన భక్తులకు నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో చిరుత కనిపించింది. దీనితో ఒక్కసారిగా వారు భయాందోళనలకు గురయ్యారు. టీటీడీకి సమాచారం ఇచ్చారు. ఈ చిరుత సంచారంపై సీసీ కెమెరాల ద్వారా దృష్టి సారించారు టీటీడీ సిబ్బంది.












Click it and Unblock the Notifications