కవిత ఇంట్లో లిఫ్ట్ కూలి గాయపడ్డ రత్నం, టి కేబినెట్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత నివాసంలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తూ లిఫ్ట్ కూలింది. ఈ ఘటనలో మాజీ శాసన సభ్యుడు కెఎస్ రత్నం సహా పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి.
మెడికల్ టూరిజంకు పెద్దపీట: కెటిఆర్
హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఇండో గ్లోబల్ హెల్త్ కేర్ సదస్సును తెలంగాణ రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం ప్రారంభఇంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో మెడికల్ టూరిజానికి పెద్ద పీట వేస్తామని చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని ఆరోగ్య రాజధానిగా చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్‌తో పాటు హెల్త్ కార్డులను కూడా ఇస్తామన్నారు.
హైదరాబాదులో తప్ప తెలంగాణలో మరెక్కడా ఉన్నత స్థాయి ఆరోగ్య వసతులు లేవన్నారు. ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, రెండు రెట్లు అధికంగా నిధులు ఇస్తామన్నారు. మెడికల్ సీట్ల పెంపు కోసం కెసిఆర్ త్వరలోనే ఢిల్లీ వెళ్తారన్నారు. ఫార్మసీ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తామని చెప్పారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు కెసిఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. భౌగోళికంగా హైదరాబాద్ అన్ని విధాలా అనువైన ప్రాంతమని, అందుకే పెట్టుబడిదారులు హైదరాబాదు వైపు చూస్తున్నారన్నారు. రాబోయే 15 ఏళ్లలో హైదరాబాద్ నగరం మూడింతలు విస్తరిస్తుందన్నారు. భువనగిరి, షాద్‌నగర్, గజ్వేల్ లాంటి ప్రాంతాల వరకు నగరం విస్తరిస్తుందన్నారు. మెట్రో రైలు అందుబాటులోకి వస్తే సిటీలో ప్రజారవాణా వ్యవస్థ మెరుగవుతుందని, టీఆర్ఎస్ ప్రభుత్వంపై భారీ అంచనాలున్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ
శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ కాబోతోంది. మంత్రులందరూ అందుబాటులో ఉండాలని ఇప్పటికే కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో పోలవరం ఆర్డినెన్స్, రైతు రుణమాఫీ, విద్యుత్ ఒప్పందాలు తదితర అంశాలపై లోతుగా చర్చించే అవకాశం ఉంది. భేటీ అనంతరం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాఖలవారీగా కెసిఆర్ సమీక్షలు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications