స్థానిక ఎన్నికలో.. టీడీపీ, వైసీపీ మధ్య సయోధ్య! ఏకగ్రీవంగా పదవుల పంపకం?

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: వైసీపీ, టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడం సహజమే. ఎందుకంటే ఆ రెండు పార్టీలు పరస్పరం వ్యతిరేకం. కానీ ఆశ్చర్యం ఏమిటంటే.. ఈ రెండు పార్టీలు స్థానిక ఎన్నికల్లో ఒక్కటైపోయాయి. ఓ మండలపరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను కలిసి పంచుకున్నాయి.

మునగపాక మండల పరిషత్తు నూతన అధ్యక్షురాలిగా వైసీపీకి చెందిన దాసరి గౌరిలక్ష్మి, ఉపాధ్యక్షునిగా టీడీపీకి చెందిన ఉల్లింగల గోవిందలను ఎన్నుకోవాలని టీడీపీ, వైసీపీలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు.

tdp-ycp-flags

మునగపాక పీఏసీఎస్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పీఏ వేగి మహేష్‌, టీడీపీ మండల అధ్యక్షుడు దాడి ముసిలినాయుడు, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం టీడీపీ, వైసీపీ ఎంపీటీసీలతో ప్రత్యేక సమావేశం జరిగింది.

గతంలో అనుకున్న విధంగానే ఈ సమావేశంలో వైసీపీకి చెందిన నాగవరం ఎంపీటీసీ దాసరి గౌరిలక్ష్మిని అధ్యక్షురాలుగా, ఉపాధ్యక్షునిగా ఒంపోలు ఎంపీటీసీ ఉల్లింగల గోవిందను ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశానికి వైసీపీకి చెందిన ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు హాజరుకాగా, టీడీపీకి చెందిన ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యుల్లో ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. వాడ్రాపల్లి ఎంపీటీసీ, మాజీ ఎంపీపీ ఆడారి మంజు, ఉమ్మలాడ ఎంపీటీసీ మొల్లేటి శేషు, తోటాడ ఎంపీటీసీ దాడి లతలు సమావేశానికి హాజరుకాలేదు.

ఈ నెల 18న మండల పరిషత్‌ కార్యాలయంలో ఆర్డీవో ఎంవీ సూర్యకళ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల ఎన్నిక జరుగుతుంది. ఆ తరువాత ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు సమక్షంలో ఎంపీపీగా గౌరిలక్ష్మి, వైస్‌ ఎంపీపీగా గోవింద ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Those two parties are against each other. But the surprise thing is this.. in a local body election both the parties came to an understand and divided president, vice president posts unanimously.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి