అది వైసీపీకి అంతిమయాత్ర.. దమ్ముంటే రా.. జగన్ కు లోకేష్ సవాల్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పోటాపోటీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు. ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుండి చంద్రబాబు రా కదలిరా సభలను నిర్వహిస్తే, నారా లోకేష్ శంఖారావం సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
తాజాగా లోకేష్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన శంఖారావం సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజుకో మోసం, పూటకో అబద్ధం జగన్ తీరని ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని లోకేష్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు జగన్ తియ్యని మాటలు చెప్పారని, అధికారంలోకి రాగానే అన్ని మర్చిపోయారని విమర్శించారు. ఏటా డీఎస్సీ అని చెప్పి ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు.

టిడిపి జనసేన ప్రభుత్వం రాగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని లోకేష్ వెల్లడించారు. మా నమ్మకం నువ్వే జగన్ అని బోర్డులు పెడుతున్నారని, జగన్ ను తల్లి, చెల్లి నమ్మడం లేదని అలాంటప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారు అంటూ ప్రశ్నించారు. ప్రాణహాని ఉందని షర్మిల, సునీత చెప్పే పరిస్థితి వచ్చిందని లోకేష్ పేర్కొన్నారు.
ఇంట్లో ఉన్న మహిళలకు రక్షణ కల్పించలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారు అంటూ విమర్శించారు. జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు షర్మిలను బెదిరిస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. జగన్ ను చూస్తే కోడి కత్తి, చంద్రబాబును చూస్తే కియా కారు గుర్తు వస్తాయని లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ ప్రిజనరీ, చంద్రబాబు విజనరీ అని పేర్కొన్నారు.
ఏ తప్పు చేయని చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారని, లక్ష కోట్ల ప్రజాధనం లూటీ చేసిన జగన్ తొందరలోనే జైలుకు వెళతారని లోకేష్ హెచ్చరించారు. బాంబులకే భయపడని కుటుంబం మాది పనికిమాలిన కేసులకు భయపడతామా అంటూ ప్రశ్నించారు. అవినీతిపై చర్చకు సిద్ధమని జగన్ కు సవాల్ చేస్తున్నానని, ఎవరు ఎంత అవినీతి చేశారో చర్చలో తేలిపోతుంది దమ్ముంటే రావాలని లోకేష్ జగన్ కు సవాల్ విసిరారు.
కోట్లు ఖర్చుపెట్టి యాత్ర 2సినిమా తీస్తే అది వైసీపీకి అంతిమయాత్రగా మారిందన్నారు. జగన్ ఇటీవల మీ బిడ్డ మీ బిడ్డ అని ప్రచారం చేసుకుంటున్నాడు అని నమ్మి ఓటేస్తే మోసం చేస్తాడని, మీ భూములు కబ్జా చేస్తాడని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications