ఏదా గన్? ఎక్కడా జగన్? జగన్ సొంత కడప జిల్లాలోనే దారుణమా? ప్రశ్నించిన లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస అత్యాచార ఘటనలపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. జగన్ పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల పై అత్యాచారాలు జరుగుతున్నా వీటిని అడ్డుకోకుండా, నియంత్రణ చర్యలు చేపట్టకుండా పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.
రోజుకో దారుణ ఘటన జరుగుతుందని, ఇది వైసీపీ పాలనా వైఫల్యం అంటూ మండిపడుతున్నారు. మహిళల రక్షణ కోసం తెచ్చిన దిశా చట్టం ఎక్కడ పని చేస్తుందో చూపించాలని సవాల్ విసురుతున్నారు. ఇక మహిళా హోం మంత్రి అసమర్ధతపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడప జిల్లాలో దళిత బాలికపై ఓ యువకుడితో పాటు మరో 9 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన పై నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో భిక్షాటన చేస్తున్న ఓ బాలిక గర్భం దాల్చడంతో బాలిక సామూహిక అత్యాచారానికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనలో కేసు బుక్ చెయ్యకుండా గుట్టు చప్పుడు కాకుండా బాలికను ఓ ప్రైవేట్ ఆశ్రమానికి తరలించారన్న విషయం వెలుగులోకి రావటంతో ఈ ఘటనపై మండిపడిన లోకేష్ సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డికి సూటి ప్రశ్నలు వేశారు.
గన్ కంటే ముందొస్తాడని కోట్ల రూపాయల ప్రకటనల ద్వారా ప్రచారం చేయించుకున్న జగన్ సొంత కడప జిల్లా ప్రొద్దుటూరులో అన్నెంపున్నెం ఎరుగని దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే..ఏదా గన్? ఎక్కడా జగన్? అంటూ ప్రశ్నించారు. అమాయక బాలికపై లైంగిక దాడిని మహిళా పోలీసులు వెలుగులోకి తెస్తే పోలీసులు నిందితుల్ని పట్టుకోకుండా కేసు మాఫీ చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ పోలీసులను నిలదీశారు. పదిహేనేళ్లు కూడా నిండని బాలికని గర్భవతిని చేసిన నిందితులని కాపాడటమేనా మీరు ఆడబిడ్డలకి కల్పించే రక్షణా? అని జగన్ మోహన్ రెడ్డిని, జగన్ సర్కార్ ను టార్గెట్ చేసి లోకేష్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications