లోకసభ ఎన్నికలు 2019 : బాపట్ల నియోజకవర్గం గురించి తెలుసుకోండి

గుంటూరు - ప్రకాశం జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో ఉంది. గుంటూరు జిల్లాలో మూడు..ప్రకాశం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు బాపట్ల పరిధిలోకి వస్తాయి. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో బాపట్ల లోక్‌సభ ఎస్సీ రిజర్వ్ గా మారింది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు..సినీ దిగ్గజం దివంగత రామానాయుడు వంటి వారితో పాటుగా పనబాక లక్ష్మీ, దగ్గుబాటి పురంధేశ్వరి ఇదే నియోజకవర్గం లో గెలుపు - ఓటములు చవి చూసారు.
11 సార్లు ఎన్నికలు.. బరిలో యోధులు..
బాపట్ల లోక్‌సభ నియోజకవర్గానికి 1977 లో తొలి సారి ఎన్నిక జరిగింది. ఇదే నియోజకవర్గం నుండి ప్రస్తుత ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు 1989 లో బిజెపి నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి బెంజిమెన్ చేతిలో ఓడిపోయారు. దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి సైతం ఇక్కడి నుండి 1998లో ఎంపీగా గెలిచారు. సినీ దిగ్గజం రామానాయుడు ఇక్కడి నుండి రెండో సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచి..మరోసారి ఓడిపోయారు. కేంద్ర మాజీ మహిళా మంత్రులు పనబా క లక్ష్మీ..దగ్గుబాటి పురంధేశ్వరి ఇక్కడి నుండి ఎంపీలుగా గెలిచిన వారే.
సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యత..
రెండు జిల్లల్లో విస్తరించి ఉన్న ఈ లోక్‌సభ నియోజకవర్గం లో సామాజిక సమీకరణాలు ఎప్పుడూ కీలక భూమిక పోషి స్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన 11 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు ఆరు సార్లు గెలవగా..టిడిపి నుండి పోటీ చేసి న వారు అయిదు సార్లు గెలుపొందారు. ఇక, వర్గాల వారీగా చూసుకుంటే కమ్మ వర్గానికి చెందిన వారు అయిదు సార్లు, రెడ్డి వర్గానికి చెందిన వారు ఒక సారి, కాపు-ఒక సారి, క్రిస్టియన్- ఒకసారి, ఎస్సీ వర్గం నుండి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు.

2014 లో టిడిపి అభ్యర్ధి గెలుపు..
2014 లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుండి పోటీ చేసిన శ్రీరాం మాల్యాద్రి వైసిపి అభ్యర్ధి వరికూటి అమృతపాణిని 32754 ఓట్ల తేడాతో ఓడించారు. మొత్తం నియోజకవర్గ పరిధిలో 1,392,965 ఓట్లు ఉండగా, అందులో మహిళా ఓటర్లు 706,483 , పురుష ఓటర్లు.. 686,482 గా ఉన్నారు. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధికి 578,145 ఓట్లు పోల్ కాగా.. వైసిపి అభ్యర్దికి 545,391 ఓట్లు దక్కాయి. 2014 ఎన్నికల్లో 85 శాతం పోలింగ్ నమోదైంది. ఇక, రెండు జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేమూరు లో 3014, రేపల్లె లో 12433, పర్చూరు లో 12394, చీరాలో 9924 ఓట్లు టిడిపికి మెజార్టీ.. కాగా, వైసిపికి బాపట్ల లో 2331, అద్దంకి లో 2045, సంతనూతల పాడు లో 1150 ఓట్ల మెజార్టీ వచ్చింది.
మాల్యాద్రి సమర్ధత ఎలా ఉందంటే..
బాపట్ల లోక్‌సభ సభ్యుడిగా మాల్యాద్రి ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో మూడు చర్చల్లో మాత్రమే పాల్గొన్నారు. ఇక, ఒక్క బిల్లును కూడా ఆయన ప్రతిపాదించ లేదు. లోక్‌సభ సభ్యుడిగా మాల్యాద్రి 193 ప్రశ్నలు సంధించారు. సమావేశా లకు హాజరు శాతం మాత్రం 92 శాతం ఉంది.
మొదలైన ఎన్నికల హడావుడి..
బాపట్ల లోక్‌సభ పరిధిలో 2019 ఎన్నికల హడావుడి ఇప్పటికే మొదలైంది. టిడిపి నుండి సిట్టింగ్ ఎంపీకి సీటు ఖాయమ నే ప్రచారం జరుగుతోంది. అదే విధంగా వైసిపి నుండి మాత్రం ఇద్దరు అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ఇక, లోక్‌సభ పరి ధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక..లోక్‌సభ ఫలితం పై ప్రభావం చూపనుంది. అసెంబ్లీ అభ్య ర్ధులు..లోక్‌సభ అభ్యర్ధులు ఎవరనేది ఖరారు కాకముందే కొందరు ప్రజలతో కలిసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. మరి కొందరు ఖచ్చితంగా టిక్కెట్ తమదే అనే ధీమాతో కనిపిస్తున్నారు. ఇక, ఎస్సీ నియెజకవర్గం కావటంతో అన్ని పార్టీలు ఇక్కడ గెలుపు పై ఆశలు పెట్టుకుంటున్నాయి.