అధికారులకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్!
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం కలిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పర్యటనలో భాగంగా రెండో రోజు నాగర్‌కర్నూల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో పనుల తీరును పరిశీలించి.. ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పంప్‌హౌస్‌లు, కాలువల నిర్మాణ పనుల క్షేత్రస్థాయి పరిశీలన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర గ్రామానికి చేరుకుని, అక్కడ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS) పంప్‌హౌస్‌ను కూలంకషంగా పరిశీలించారు. అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోకి వెళ్లి ఈ ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన నార్లాపూర్ ప్యాకేజీ-2, ప్యాకేజీ-3 కాలువల నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా వీక్షించారు. పనులు ఎంతవరకు వచ్చాయి, ఇంకా ఎంత శ్రమ అవసరమవుతుందనే విషయాలను మ్యాపుల ద్వారా తెలుసుకున్నారు.

మంత్రులు, అధికారులతో కలిసి సీఎం సమీక్ష
ఈ క్షేత్రస్థాయి పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ శాసనసభ్యులు వాకాటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మంత్రుల బృందంతో కలిసి కాలువల నిర్మాణ ప్రాంతాలను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడారు. పనుల్లో ఎదురవుతున్న సాంకేతిక, భూసేకరణ ఇబ్బందులను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.
నాణ్యతలో రాజీ పడొద్దు..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు ప్రాంతానికి సాగునీరు, తాగునీటి అవసరాలను తీర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడానికి ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందన్నారు. పనుల వేగం పెంచే క్రమంలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకూడదని, అంతర్జాతీయ ప్రమాణాలతో కాలువల నిర్మాణం జరగాలని అధికారులను గట్టిగా ఆదేశించారు. పాలమూరు వలసల కష్టాలను తీర్చే వరకు ఈ ప్రాజెక్టు పనులను నిరంతరం పర్యవేక్షిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications