NDA కూటమి విజ్ఞప్తి! ఫేక్ ఐడీలపై ఉమ్మడి సమరం
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం రోజురోజూకు ఊహించని ఎత్తుగడలతో హీట్ ఎక్కుతుంది. ఓవైపు ప్రజాక్షేత్రంలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వం, మరోవైపు డిజిటల్ వేదికగా సాగుతున్న ఫేక్ ఐడీలపై యుద్ధం ప్రకటించింది. అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల.. ఎన్డీయే కూటమి మధ్య పూడ్చలేని వ్యత్యాసాలు సృష్టించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మైండ్ గేమ్‌కు తెరలేపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ రంగంలోకి దిగి, తమ శ్రేణులకు, అభిమానులకు అత్యంత కీలకమైన ఉమ్మడి విజ్ఞప్తిని, హెచ్చరిక ప్రకటనను విడుదల చేసింది.
ఇటీవల సోషల్ మీడియాలో 'గోడమీద పిల్లి' లాంటి వైఖరితో సాగుతున్న 'సూడో', 'ఫేక్' ఖాతాల వ్యవహారం కూటమి పెద్దల దృష్టికి వచ్చింది. టీడీపీ అభిమానిలా నటిస్తూ పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా దూషించడం, లేదా జనసేన కార్యకర్తలా కనిపించే ఫేక్ ఐడీతో చంద్రబాబును విమర్శించడం ద్వారా ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు ముమ్మరంగా సాగుతున్నాయని ప్రకటనలో ఎండగట్టారు. ఈ ఫేక్ ప్రచారాల వలలో పడి అసలైన కార్యకర్తలు ఆవేశానికి లోనై పరస్పరం దాడులకు దిగడం వల్ల, అంతిమంగా వైఎస్సార్సీపీకే రాజకీయంగా ప్రయోజనం చేకూరుతోందని కూటమి నాయకత్వం స్పష్టం చేసింది. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో మిత్రధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించవద్దని కోరింది.

సహించేది లేదు.. మితిమీరితే కఠిన చర్యలు తప్పువు!
కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు జరుగుతున్న ఈ సైబర్ కుట్రలను అడ్డుకునేందుకు మూడు పార్టీల నాయకత్వం ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇకపై కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులపై ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత విమర్శలు, దూషణలు లేదా కక్షపూరిత ప్రచారానికి దిగితే, వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పింది. ఏ పార్టీ శ్రేణులైనా సరే వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. అనుమానాస్పద ప్రచారాలు కనిపిస్తే వెంటనే ఆవేశపడి కామెంట్లు చేయకుండా, నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావాలని సూచించింది.
డిజిటల్ ప్రచారానికి కొత్త రోడ్‌మ్యాప్!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న బృహత్తర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే కూటమి సోషల్ మీడియా ప్రధాన లక్ష్యమని ప్రకటన పునరుద్ఘాటించింది. ప్రతిపక్షాలు వ్యాప్తి చేస్తున్న తప్పుడు ప్రచారాలను, అసత్యాలను నిజమైన ఆధారాలతో సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది. "కూటమి ఐక్యతే మన బలం - సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయడమే మన లక్ష్యం" అనే నినాదంతో సోషల్ మీడియా యోధులంతా ఒకే తాటిపైకి వచ్చి ఐక్యతను చాటాలని ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications