హైదరాబాద్‌లో వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్న చిరంజీవి
మహేష్ బాబు, అల్లు అర్జున్ రూట్ వేరు.. మెగాస్టార్ చిరంజీవి ప్లాన్ వేరు! టాలీవుడ్ స్టార్ హీరోలు ఎగ్జిబిషన్ రంగంలో ఇప్పటికే తమదైన ముద్ర వేశారు. కానీ, ఇప్పుడు వారందరినీ మించేలా మెగాస్టార్ చిరంజీవి ఒక అద్భుతమైన ప్లాన్‌తో ముందుకొస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్‌ను తీసుకువచ్చేందుకు మెగాస్టార్ సన్నాహాలు చేస్తున్నారు.
ప్రపంచ రికార్డులపై మెగాస్టార్ కన్ను
సినిమా థియేటర్ల వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న 'ఏషియన్ సినిమాస్' తో కలిసి చిరంజీవి ఈ భారీ ప్రీమియం ప్రాపర్టీని ప్లాన్ చేస్తున్నారు. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ విశేషాలను వెల్లడించారు. ప్రస్తుతం జర్మనీలోని 'ట్రామ్‌పాలస్ట్ లియోన్‌బర్గ్' స్క్రీన్ (సుమారు 127 అడుగుల వెడల్పు, 69 అడుగుల ఎత్తు, 8,770 చదరపు అడుగుల విస్తీర్ణం) పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్ గిన్నిస్ రికార్డు ఉంది. అలాగే అమెరికాలోని జార్జియాలో రాయల్ సినిమాస్ ఐమ్యాక్స్ స్క్రీన్ కూడా భారీ హంగులతో ఉంది. కానీ, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి రికార్డులను సైతం వెనక్కి నెట్టేలా, ప్రపంచంలోనే నంబర్ వన్ స్క్రీన్‌ను హైదరాబాద్‌లో నిర్మించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది.

హైదరాబాద్‌లో ఇప్పటికే పెరుగుతున్న పోటీ
టాలీవుడ్‌లో ఇప్పటికే ప్రీమియం సినిమా అనుభవాల కోసం పోటీ పెరిగింది. కోకాపేట్‌లోని అల్లు అర్జున్ 'అల్లు సినిమాస్'లో సుమారు 75 అడుగుల వెడల్పుతో కూడిన భారత్‌లో అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు మహేష్ బాబు కూడా ఏషియన్ గ్రూప్‌తో కలిసి 'AMB సినిమాస్' ద్వారా మల్టీప్లెక్స్ రంగంలో ట్రెండ్ సెట్ చేశారు. అయితే, వీటన్నింటినీ మించిపోయే రేంజ్‌లో చిరంజీవి ప్రాజెక్ట్ ఉండబోతుండటం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఖచ్చితమైన కొలతలు, సీటింగ్ కెపాసిటీ, అత్యాధునిక ప్రొజెక్షన్ టెక్నాలజీ వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, హైదరాబాద్ సినిమా ప్రదర్శన ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం ఖాయం.














Click it and Unblock the Notifications
