అంతర్జాతీయ స్థాయిలో కోహెడ ఫ్రూట్ మార్కెట్.. ఊహకందని ప్రత్యేకతలు!
హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోహెడలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ సమగ్ర పండ్ల మార్కెట్ అనేక వినూత్న సాంకేతికతలు, అద్భుతమైన వసతులతో దేశంలోనే ఒక మోడల్ మార్కెట్‌గా రూపుదిద్దుకోబోతోంది. కేవలం పండ్ల క్రయవిక్రయాలకే పరిమితం కాకుండా, ఒకే చోట అన్ని రకాల వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులు లభించేలా దీనిని డిజైన్ చేశారు.శనివారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ భారీ ప్రాజెక్టుకు భూమిపూజ చేయనున్నారు.
ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ లలో ఒకటి
ఈ మెగా మార్కెట్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన ప్రత్యేకతలు మరియు అత్యాధునిక వసతుల వివరాలు చూస్తే ఇది దేశంలోనే అతిపెద్ద మార్కెట్. ఔటర్ రింగ్ రోడ్డు ను ఆనుకుని సుమారు 239 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూ. 1,091 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మిస్తున్నారు. ఇది ఢిల్లీలోని ప్రసిద్ధ ఆజాద్‌పూర్ మార్కెట్ కంటే పెద్దదిగా, ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా నిలవనుంది.

మార్కెట్ విస్తీర్ణంలో 70% భాగాన్ని కేవలం పండ్ల వ్యాపారానికి కేటాయింపు
ఈ మార్కెట్ విస్తీర్ణంలో 70% భాగాన్ని కేవలం పండ్ల వ్యాపారానికి కేటాయించారు. మిగిలిన 30% స్థలాన్ని కూరగాయలు, పూలు, డ్రై ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, మాంసం, పౌల్ట్రీ మరియు సీఫుడ్ విక్రయాల కోసం కేటాయించి ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తెస్తున్నారు. మార్కెట్ ప్రాంగణంలో వంద అడుగుల ఎత్తుతో, 19,375 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక భారీ ఐకానిక్ టవర్‌ను నిర్మిస్తున్నారు.
మార్కెట్ కార్యాకలాపాల కోసం ఏఐ డేటా సెంటర్
ఈ టవర్‌లోని 4 అంతస్తులను జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య సంస్థలకు, ఎగుమతి వ్యాపారులకు లీజుకు ఇవ్వనున్నారు. ఈ బిల్డింగ్ పైభాగంలో హెలిప్యాడ్ సదుపాయం కూడా ఉంటుంది. మార్కెట్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, ధరల వ్యత్యాసాలను గమనించడానికి మరియు డిజిటల్ లావాదేవీల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏఐ ఆధారిత సేవలను మరియు డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
విదేశాలకు ఎగుమతి నేరుగా ఇక్కడ నుండే
విదేశాలకు పండ్లను ఎగుమతి చేసేందుకు వీలుగా మార్కెట్ లోపలే కస్టమ్స్ క్లియరెన్స్ కేంద్రం , ఇరాడియేషన్, వ్యాపర్ హీట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు మరియు సర్టిఫికేషన్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడి నుంచే నేరుగా విదేశాలకు ఉత్పత్తులను పంపవచ్చు. దాదాపు 20 ఎకరాల్లో భారీ కోల్డ్ స్టోరేజ్ లను నిర్మిస్తున్నారు. పండ్లు, కూరగాయల నాణ్యత చెడిపోకుండా ఉండేందుకు వేలం పాటలు జరిగే షెడ్లలో కూడా ఉష్ణోగ్రత నియంత్రణ వసతి ఉంటుంది.
పర్యావరణ హితంగా కోహెడ గ్లోబల్ గ్రీన్ మార్కెట్
పర్యావరణహితంగా మార్కెట్ షెడ్లపై సోలార్ రూఫ్ టాప్స్ ఏర్పాటు చేస్తున్నారు. మార్కెట్ లోపల రవాణా ఇబ్బందులు లేకుండా భారీ ట్రక్ డాకింగ్ షెడ్లు, డ్రైయింగ్ యార్డులతో పాటు రెండు పెట్రోల్ బంకులు మరియు నాలుగు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఫ్రాన్స్‌లోని 'రుంగిస్' , స్పెయిన్‌లోని 'మాడ్రిడ్' అంతర్జాతీయ మార్కెట్ల నమూనాలను అధ్యయనం చేసి, ఈ సరికొత్త కోహెడ గ్లోబల్ గ్రీన్ మార్కెట్‌ను డిజైన్ చేశారు.












Click it and Unblock the Notifications