"ఆర్ధిక సంక్షోభం అంచున భారత్"- నాలుగేళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం చేరిన వేళ రాహుల్..!
దేశవ్యాప్తంగా ధరలు మండిపోతున్నాయి. నిత్యావసరాల నుంచి అత్యవసరాలు, విలాస వస్తువుల వరకూ ఏది ముట్టుకున్నా షాక్ కొడుతోంది. దీంతో సంపన్నుల సంపద ఆవిరవుతుండగా.. మధ్యతరగతి కాస్తా పేదలుగా మారిపోతున్నారు. నాలుగేళ్ల గరిష్టానికి హోల్ సేల్ ద్రవ్యోల్బణం చేరినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఆర్ధిక పతనం అంచున నిలబడి ఉందని విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హెచ్చరించారు.
దేశంలో ఈ ఏడాది అక్టోబర్ నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం నాలుగేళ్ల గరిష్ట స్దాయిని చేరి 12.3 శాతానికి చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఇది వరుసగా రెండో నెలలో రెండంకెల సంఖ్యలోనే కొనసాగింది. అంటే సరుకులు దుకాణాలకు, వినియోగదారులకు చేరకముందే వాటి ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల 60 శాతం భారతీయ కుటుంబాలు ప్రభావితమవుతున్నట్లు తాజాగా లోకల్‌సర్కిల్స్ సర్వే తేల్చింది. 12 నెలల క్రితంతో పోలిస్తే ఇప్పుడు నిత్యావసర వస్తువులపై ఎక్కువ ఖర్చు చేస్తున్నామని 98 శాతం మంది ఈ సర్వేలో తెలిపారు. దాదాపు 92 శాతం మంది తమ ఖర్చు కనీసం 10 శాతం పెరిగిందని చెప్పగా, 79 శాతం మంది ఖర్చు ఖర్చు 15 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరిగిందని చెప్పారు.
అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం కూడా ఆర్బీఐ నిర్దేశించిన 6 శాతం గరిష్ట సహన పరిమితిని దాటి 6.09 శాతానికి చేరింది.

ఈ నేపథ్యంలో అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో విపక్ష నేత రాహుల్ గాంధీ.. భారత్ ఆర్ధిక విపత్తు కోరల్లో చిక్కుకుందని వెల్లడించారు. భారీ నిరుద్యోగం, కుంటుపడిన ఉత్పాదక రంగం, విద్యా వ్యవస్థలో పాతుకుపోయిన సమస్యలను ఆయన కారణాలుగా చెప్పారు. భారత్ ఆర్థిక నమూనా దాదాపు దశాబ్దం క్రితమే ఫలితాలను ఇవ్వడం ఆపేసిందన్నారు. అలాగే మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి బీజేపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల సామర్థ్యాన్ని రాహుల్ ప్రశ్నించారు. ఈ పథకాలు తగినన్ని ఉద్యోగాలను సృష్టించడంలో విఫలమయ్యాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, వ్యవసాయం ఇప్పుడు కుప్పకూలాయని, తద్వారా వెన్నెముక విరిగిపోయిందని రాహుల్ తెలిపారు. సేవల రంగం మాత్రమే ఉద్యోగాలు ఇవ్వలేదని, తయారీ రంగంపైనా దృష్టిసారించాలన్నారు.














Click it and Unblock the Notifications
