మద్యం తాగించి, రేప్ చేసి ప్రియుడే ఆమెను చంపేశాడు

వివరాలు ఇలా ఉన్నాయి - ఖమ్మం జిల్లా మధితర మండలం వంగవీడు గ్రామానికి చెందిన యరమల రాజశేఖర రెడ్డి అదే జిల్లా బోనకల్లు మండలం చిరునోములలో పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. మథిర మండలం మడుపల్లి గ్రామానికి చెందిన వివాహిత యరమల వెంకట్రామమ్మతో అతనికి వైవాహికేతర సంబంధం ఉంది.
ఇటీవల ఆమె మరో వ్యక్తితో కూడా చనువుగా ఉండడాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. అతను ఆమెను మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి. రాజశేఖర రెడ్డి ఇటీవలే తీర్థయాత్రలకు వెళ్లివచ్చాడు. తాను మందలించినా ఆమె ప్రవర్తన మారకపోవడంతో రాజశేఖర రెడ్డి ఆమెను హత్య చేయాలని పథకం వేసుకున్నాడు.
పథకం వేసుకున్న రాజశేఖర రెడ్డి ఆ మహిళతో తిరిగి సన్నిహితంగా ఉండడం ప్రారంభించాడు. సోమవారం సాయంత్రం తన ద్విచక్రవాహనంపై వత్సవాయి- బోనకల్లు మధ్య డొంకదారిలోకి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెకు మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె తలపై బండరాయితో బలంగా మోదాడు. మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి అతను వెళ్లిపోయాడు.
మంగళవారం ఉదయం ఆ సంఘటన వెలుగులోకి వచ్చింది. వంగవీడు గ్రామానికి వెళ్లి పోలీసులు రాజశేఖర రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications