నేటి నుంచి నగదు బదిలీ... తెలంగాణలో ఏడు, ఏపీలో నాలుగు
హైదరాబాద్: వంట గ్యాస్ వినియోగదారులకు వర్తింప చేయనున్న నగదు బదిలీ పధకం రెండో దశ దేశ గురవారం నుంచి ప్రారంభం కానుంది. దేశం మొత్తం మీద 630 జిల్లాల్లో ఈ పధకాన్ని అమలు చేయనున్నారు. మొదటి దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 12 జిల్లాలను ఎంపిక చేశారు.
మిగిలిన జిల్లాలను రెండో దశలో చేర్చారు. తెలంగాణలో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో గురువారం నుంచి ఈ పధకం అముల్లోకి రానుంది. ఇక ఏపీలో విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో అమలు చేయనున్నారు.

తొలిదశలో తలెత్తిన సాంకేతిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని... రెండో దశలో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. గ్యాస్ వినియోగదారుల వివరాలు ఆధార్‌తో అనుసంధానం అయ్యాయా లేదా అనే విషయాన్ని మేసేజ్ ద్వారా తెలియజేస్తున్నారు.
ఈ మేసేజ్ ద్వారా గ్యాస్ వినియోగదారులు అప్రమత్తం అయ్యే ఛాన్స్ ఉంది. వంట గ్యాస్ సబ్సిడీని పొందేందుకు ఆధార్ కార్డు లేదా బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోకపోతే బహిరంగ మార్కెట్ ధరకే గ్యాస్‌ను వినియోగదారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
రెండోదశ నగదు బదిలీ పధకాన్ని అమలు చేసే రెండు తెలుగు రాష్ట్రాల్లోని 11 జిల్లాల వినియోదారులకు మే నెలాఖరు వరకు ఆధార్ కార్డు లేదా బ్యాంక్ ఖాతా అనుసంధానం కోసం వెసులుబాటు కల్పించారు. అప్పటికీ అనుసంధానం చేసుకోకపోతే జూన్ 1 నుంచి సిలిండర్లు బహిరంగ మార్కెట్ ధరకే కొనుగోలు చేయాల్సి ఉటుందని కేంద్ర ప్రకటనలో పేర్కొంది.
రాయితీయేతర గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రాయితీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గించింది. ఒక్కో సిలిండర్‌పై రూ.43.50 పైసలు తగ్గించింది. దాంతో, ఇంతవరకు రూ. 752 ఉన్న 14.2 కేజీల సిలిండర్ ధర ఇకనుంచి రూ.708.50 పలకనుంది. అటు అంతర్జాతీయ చమురు రేట్లు తగ్గడంతో విమాన ఇంధన ధరను 12.5 శాతం ప్రభుత్వం తగ్గించింది.












Click it and Unblock the Notifications